రాజస్థాన్, డిసెంబర్ 22: అనుకుంటాంగానీ.. కాలం కలిసొస్తే పాము కరిచినా బతకొచ్చు. కలిసిరాకపోతే చెప్పు కరిచినా టపాకట్టేస్తారు. అలాంటి సంఘటనే ఇది. ఈ కారు రోడ్డుపై హాలీవుడ్ మువీ రేంజ్‌లో పల్టీలు కొట్టింది. రోడ్డంతా దుమ్ముదుమ్ముగా లేచిపోయింది. ఆనక పక్కనే ఉన్న ఓ గేటుపై ల్యాండ్ అయ్యింది. అయితే అందులో ఉన్న ఐదుగురికి ఒక్క దెబ్బ కూడా తగలక పోవడం వింతల్లో వింత. అంతేనా.. వీరంతా ఎలాగోలా కారుదిగి పక్కనే ఉన్న దుఖాణంలోకెళ్లి ‘అన్నా ఛాయ్..!’ అంటూ ఓ కేకవేశారు. చుట్టుపక్కనున్నోళ్లంతా నోరెళ్లబెట్టి చూడసాగారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో బీకానేర్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
రాజస్థాన్‌లోని శుక్రవారం రాత్రి ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీలో కారు నాగౌర్ నుంచి బీకానేర్‌కు బయల్దేరారు. అబ్బో వీరి వేగం చూస్తే గాలి కూడా దడుసుకుంటుంది. అంత వేగంగా నడుపుతున్న వీరి కారు బీకానేర్ సమీపంలో మార్గమధ్యంలో ఓ మూలమలుపు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పింది. క్షణాల్లో కారు రోడ్డుపై ఎనిమిది సార్లు పల్టీలు కొట్టింది. అనంతరం ఓ కార్ల షోరూం గేటుపై బోల్తాపడి.. అక్కడే ల్యాండ్ అయ్యింది. ఈ ప్రమాదంలో కారు తుక్కు తుక్కు అయ్యింది. అయితే కారులో ఉన్న వారికి మాత్రం ఎవరికీ గాయాలు కాకపోవడం విశేషం.
ఇవి కూడా చదవండి
In a dramatic turn of events, five passengers miraculously escaped without any injury after their car flipped multiple times during a freak accident on a highway in #Rajasthan’s #Nagaur on Friday. The horrific incident was caught on CCTV. The footage shows an SUV carrying the… pic.twitter.com/XIgtOy3IFc
— Hate Detector 🔍 (@HateDetectors) December 21, 2024
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కారు పల్టీలు కొడుతున్న సమయంలో అందులో నుంచి డ్రైవర్ బయటకు దూకేశాడు. కారు దానికదే ఆగిపోవడంతో మిగతా నలుగురు ప్రయాణికులు దిగారు. ఈ ఊహించని ప్రమాదం తర్వాత ఈ ఐదుగురి వింత ప్రవర్తన ఇంకా ఆశ్చర్యం కలిగించింది. పక్కనే ఉన్న కార్ల షోరూం లోపలికి నడుచుకొంటూ వెళ్లి.. అన్నా మాకు కొంచెం చాయ్ ఇస్తావా? అని అడిగారు. చాయ్ మాత్రమే ఏమిటీ!.. వీళ్లకు భూమ్మీద చాలా నూకలు కూడా మిగిలున్నాయనిపిస్తుంది.. ఈ వీడియో చూస్తే. అవగింజ అదృష్టం ఉంటే బాగుండు అని అందరూ అనుకుంటారు. వీరికి ఏకంగా గుమ్మడి పండంత ఉన్నట్లు ఉంది చూడబోతే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.