హిందూ మతంలో తులసి మొక్క చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని హిందువుల విశ్వాసం. ఈ కారణంగా తులసి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హిందువుల ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కకు రోజూ పూజలు చేస్తారు. అంతేకాదు తులసి దళాలను (తులసి ఆకులు) కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో, పండగల్లో, పూజలు, ఉపవాసం మొదలైన సందర్భాల్లో ఉపయోగిస్తారు. విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టం. అందుకే విష్ణు పూజలో తులసి దళాలకు విశిష్ట స్థానం ఉంది. తులసిని ఖచ్చితంగా సమర్పిస్తారు. ప్రతిరోజూ ఉదయం తులసి మొక్కకు నీళ్ళు సమర్పిస్తారు. సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం పెట్టే సంప్రదాయం ఉంది.
సాయంత్రం వేళ తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని, ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని మత విశ్వాసం. తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది. శ్రీ మహా విష్ణు పూజలో, ఆయనకు సమర్పించే నైవేద్యంలో తులసి దళాలను తప్పని సరిగా ఉపయోగిస్తారు. అయితే తులసిని తాకడానికి, తులసి దళాలను కోయడానికి శాస్త్రాలలో అనేక నియమాలు ఉన్నాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఆ ఇంట్లో పేదరికం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో తులసి దళాలను ఎప్పుడు తాకకూడదో తెలుసుకుందాం..
తులసి మొక్కను ఎప్పుడు తాకకూడదంటే
హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఆదివారం, ఏకాదశి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో తులసి మొక్కను అస్సలు తాకకూడదు.
ఇవి కూడా చదవండి
ఆదివారం: పౌరాణిక విశ్వాసం ఏమిటంటే ఆదివారం రోజున లక్ష్మిదేవి విష్ణువు కోసం ఉపవాసం ఉంటుంది. అందుకే ఈ రోజు తులసిని తాకడం, నీరు సమర్పించడం నిషేధించబడింది.
ఏకాదశి: ఏకాదశి రోజున తులసి మొక్క శ్రీ మహా విష్ణువు ధ్యానిస్తూ నీరు కూడా తీసుకోని ఉపవాసాన్ని ఆచరిస్తుంది. అందుకే ఏకాదశి రోజున తులసిని తాకకూడదు. నీరు పోయరాదు.
రాత్రి సమయం: అంతేకాదు రాత్రి సమయంలో తులసి మొక్కని అస్సలు తాకకూడదు. రాత్రి సమయంలో తులసిని తాకడం వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
తులసి దళాలను ఎప్పుడు తీయకూడదంటే
ఏకాదశి, ఆదివారం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, రాత్రి సమయాల్లో తులసి దళాలను మొక్క నుంచి కోయరాదు. అదే సమయంలో తులసి మంజరిని ఆదివారం, మంగళవారం విచ్ఛిన్నం చేయకూడదు. ఇలా చేయడం వల్ల జీవితంలో సమస్యలు వస్తాయని మత విశ్వాసం.
స్నానం చేయకుండా తులసిని తాకవచ్చా?
స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు. తులసి మొక్కను స్నానం చేసిన తర్వాత మాత్రమే తాకాలి. స్నానం చేయకుండా తులసిని తాకడం వల్ల తులసి మొక్కకు కోపం వస్తుంది.
పీరియడ్స్ సమయంలో తులసిని తాకవచ్చా?
హిందువుల విశ్వాసాల ప్రకారం ఋతుస్రావం సమయంలో స్త్రీలు తులసి మొక్కను ముట్టకూడదని లేదా నీరు పోయకూడదని చెబుతారు. ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతోంది. ఇదే విషయం సాంస్కృతిక, మత విశ్వాసాల్లో వివరించబడింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.