బొమ్మలు అంటే పిల్లలందరికీ ఎంతో ఇష్టం. ఖాళీ దొరికితే వాటితోనే ఆడుకుంటూ సమయం గడుపుతారు. వారికి ఇష్టమైన వస్తువులతో ఈ బొమ్మలే ప్రధానంగా ఉంటాయి. పుట్టిన రోజు సమయంలో పిల్లలకు బొమ్మలు బహుమతిగా అందించడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. అధిక జనాభా కలిగిన మన దేశంలో వీటి విక్రయాలు చాలా జోరుగా జరుగుతాయి. కానీ ఇతర దేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి దిగుమతుల కారణంగా ఇక్కడి బొమ్మల పరిశ్రమలు నష్టాలను చవిచూసేవి. ప్రస్తుతం మన దేశం బొమ్మలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ప్రపంచానికి ఎగుమతి చేసే స్థాయి వరకూ చేరుకుంది. మన బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.
దీని వెనుక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చొరవ కీలక పాత్ర పోషించింది. కేవలం మార్కెట్ గానే కాకుండా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, సోర్సింగ్ హబ్ గా మారింది. బొమ్మల పరిశ్రమ ప్రగతికి ఆయన అనేక చర్యలు తీసుకున్నారు. 2019 వరకూ మన దేశంలో చైనా బొమ్మల హవా విపరీతంగా ఉండేది. వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఎగబడేవారు. దీంతో స్థానికంగా తయారయ్యే బొమ్మలకు డిమాండ్ ఉండేది కాదు. క్రమంగా దేశీయ పరిశ్రమలు నష్టాల బాటలో పయనించసాగేవి. దీంతో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. చైనా బొమ్మలపై దిగుమతి సుంకాన్ని 2020 ఫిబ్రవరిలో 20 నుంచి 60 శాాతానికి పెంచింది. 2023 మార్చిలో మళ్లీ 70 శాతానికి తీసుకువెళ్లింది. దీంతో ఆ వస్తువుల దిగుమతులు బాగా తగ్గాయి. దేశంలో తయారైన బొమ్మలను ఆదరణ పెరిగింది. నాణ్యమైన, అందుబాటులో ధరలలో లోకల్ బొమ్మలు అందుబాటులోకి వచ్చాయి.
బొమ్మలను క్యాలిటీ కంట్రోల్ ఆర్డర్ (క్యూసీవో) కిందకు తీస్తూ 2021లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల దేశీయంగా తయారు చేసిన, దిగుమతి చేసుకున్న బొమ్మలన్నీ భారతీయ ప్రమాణాలను అనుగుణంగా ఉండాలి. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ లేకుండా ఏ కంపెనీ బొమ్మలను విక్రయించకూడదు. దీంతో మన దేశంలో బొమ్మల నాణ్యత పెరిగింది. ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయి వచ్చింది. దేశంలో తయారైన బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇకియా, వాల్ మార్ట్ తదితర గ్లోబల్ రిటైలర్లు మన దేశం నుంచి సోర్సింగ్ చేయడం ప్రారంభించాయి. అంతర్జాతీయ బ్రాండ్లు కూడా మన దేశాన్ని తమ తయారీ యూనిట్ గా చూస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి