హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనతో టాలీవుడ్‌కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఇక తెలంగాణలో కొత్తగా విడుదలయ్యే భారీ సినిమాలకు, నో బెనిఫిట్ షోస్, నో టికెట్ రేట్స్ హైక్ అని…అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తేల్చాశారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపును రద్దు చేయాలనే డిమాండ్ అన్నివైపుల నుంచి పెరుగుతోంది. ఇటు చూస్తే సంక్రాంతికి బడా హీరోల బిగ్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీ…గట్టి చిక్కునే ఎదుర్కొంటోంది.
ఇక బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు నో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించింది తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అసోసియేషన్. టికెట్ రేట్లు పెంచడం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు దెబ్బతిన్నాయని.. సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం…వాటికి మళ్లీ ప్రాణం పోసిందన్నారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ సెక్టార్ చైర్మన్ TS రాంప్రసాద్. తెలంగాణ సర్కార్ బాటలోనే ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలంటున్నారు వాళ్లు.
దిల్‌రాజు పైనే టాలీవుడ్ ఆశలు
ఇక సంక్రాంతి రేసులో 3 బడా సినిమాలు పోటీ పడుతున్నాయి. బాలయ్య హీరోగా బాబీ డైరెక్షన్‌లో డాకు మహారాజ్ వస్తోంది. రామ్‌చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ రానుంది. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ విడుదల కానుంది. టికెట్ రేట్లు పెంచకపోతే ఈ బడా సినిమాల పరిస్థితేంటి? దానిపైనే నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అమెరికా వెళ్లిన FDC చైర్మన్ దిల్ రాజు, హైదరాబాద్‌కి వచ్చాక ఆయనను కలిసి చర్చలు జరపనున్నారు నిర్మాతలు. దిల్‌రాజు నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ విషయంపై విజ్ఞప్తి చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. బెనిఫిట్ షోలు లేకపోయినా, టికెట్ రేట్ల హైక్ గురించి సీఎమ్‌ని సినీ పెద్దలు రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి, ఇప్పుడు దిల్‌రాజు పైనే ఆశలు పెట్టుకుంది టాలీవుడ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.