ఎవరి జాతకంలోనైనా బృహస్పతి అనుకూలమైన స్థానంలో ఉంటే.. అది ఆ వ్యక్తి తెలివితేటలను పెంచుతుంది. పిల్లలకు ఆనందాన్ని ఇస్తుంది. వివాహ అవకాశాలను సృష్టిస్తుంది. అంటే జాతకంలో గురు స్థానం బలంగా ఉంటేనే కళ్యాణ యోగం ప్రాప్తిస్తుంది. కనుక జాతకంలో గురు స్థానాని ఎప్పటికప్పుడు చూసుకుంటూ అందుకు తగిన పరిహారాలు చేస్తూ ఉంటే జీవితంలో ఉన్నత స్థితి చేరుకోవచ్చు అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
జాతకంలో బృహస్పతి స్థానం బలహీనంగా ఉంటే ఆ వ్యక్తుల వివాహంలో జాప్యం, సంతానం కలిగే విషయంలో సమస్యలు, జీవితంలోని ఇతర రంగాలలో సమస్యలను ఎదుర్కోవచ్చు. అటువంటి పరిస్థితిలో ప్రతికూల ప్రభావాలను నివారించడానికి.. గురు స్థానం బలపడడానికి.. విష్ణువు అనుగ్రహం కోసం గురువారం ఈ చర్యలు తీసుకోవచ్చు.
గురు దోషం నుండి బయటపడటానికి.. గురువారం ఉపవాసం ఉండాలి. అంతేకాదు ఈ రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు “ఓం నమో భగవతే వాసుదేవాయ నమః” అనే మంత్రాన్ని జపించండి. నుదుటిపై కుంకుమ తిలకం దిద్దుకోండి. గురువారం ఉపవాసం ఉండి.. వీలైతే అరటి మొక్కను పూజించండి. దీంతో వివాహ విషయంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి.
గురువారం రోజున లోక రక్షకుడైన శ్రీమహావిష్ణువును పూజించండి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని పఠించండి. దీంతో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.
గురువారం జాతకంలో బృహస్పతి స్థితి మెరుగు పడే వరకూ డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం విషయాల్లో తేడా వస్తే ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు.
గురువారం నాడు ఉపవాసం ఉంటే ఈ రోజున సత్య నారయణ వ్రత కధను వినడం శుభ ప్రదం. బృహస్పతి ప్రత్యేక ఆశీర్వాదం పొందడానికి ఈ రోజున ఆచారాల ప్రకారం బృహస్పతి దేవుడిని పూజించండి. చందనం, పసుపు పుష్పాలను సమర్పించండి. ప్రసాదంలో పప్పు , బెల్లం చేర్చండి. పసుపు బట్టలు ధరించండి.
మహావిష్ణువుకు పూజ చేసిన అనంతరం నైవేద్యంగా అరటి పండ్లను సమర్పించండి. అయితే పొరపాటున కూడా గురువారం అరటి పండ్లు తినవద్దు.. ఇలా చేయడం వలన గురు దోషం ఏర్పడుతుంది.