TGPSC Group 2 Exams: కొంపముంచిన ఒక్క ‘నిమిషం’ నిబంధన.. తొలిరోజే గ్రూప్ 2 పరీక్షకు పలువురు దూరం

TGPSC Group 2 Exams: కొంపముంచిన ఒక్క ‘నిమిషం’ నిబంధన.. తొలిరోజే గ్రూప్ 2 పరీక్షకు పలువురు దూరం


ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 15: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,368 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. తొలి రోజు ఉదయం పేపర్ 1 పరీక్ష ప్రశాంతంగా జరిగినప్పటికీ.. ఒక్క నిమిషం నిబంధన కొందరు అభ్యర్థుల కొంప ముంచింది. పరీక్షకు సరిగ్గా అరగంట ముందే గేట్లు మూసివేస్తామని, ముగింపు సమయంలోగా అభ్యర్ధులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని టీజీపీఎస్సీ అధికారులు ముందే హెచ్చరించారు. మధ్యాహ్నం పరీక్షకు 2.30 గంటల తరువాత గేట్లు మూసివేస్తామని చెప్పారు. దీంతో ఈ రోజు ఉదయం పేపర్‌ 1 పరీక్షకు 9.30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్ద గేట్లు మూసివేశారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. అయితే కొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు పరీక్షకు అనుమతించలేదు. ముందే స్పష్టమైన ఆదేశాలిచ్చామని, తామేం చేయలేమని అధికారులు తేల్చిచెప్పడంతో ఆలస్యంగా వచ్చిన వారంతా కన్నీరు పెట్టుకున్నారు. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఒక్క నిమిషం నిబంధన వల్ల ఏకంగా 16 మంది అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలో ముగ్గురు అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. అలాగే, మంచిర్యాల జిల్లాలో శ్రీహర్ష డిగ్రీ కాలేజీ పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినందుకు మరో ముగ్గురు అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు.

ఇక జనగామ జిల్లాలో మరో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ అరగంట ముందే పరీక్షకు హాజరైనా పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయింది. ఓఎంఆర్ షీట్ బయోమెట్రిక్ సమయంలో అభ్యర్థి సెంటర్ మారినట్లు అధికారులు గుర్తించారు. ఆమె సెంటర్ కోడ్ ఇది కాదని అధికారులు చెప్పడంతో అసలు కేంద్రానికి పరుగున వెళ్లారు.

నిజానికి జనగామలో పక్క పక్కనే రెండు పరీక్ష కేంద్రాలు ఉండడంతో పొరపాటున ఆమె మరో సెంటర్ కు వెళ్ళింది. అయితే సెంటర్ మారిందన్న సంగతి ఆమెకు ఇన్విజిలేటర్ ఓఎంఆర్ షీటు, బయోమెట్రిక్ ప్రక్రియ వేసే వరకు చెప్పలేదు. తీరా అభ్యర్థి సెంటర్ మారిందని గుర్తించే సమయానికే అరగంట వృధా అయ్యింది. ఆమె బాలింత కావడంతో బయటికి పరుగున వచ్చి.. పసిబిడ్డతో పక్కనే ఉన్న మరో పరీక్ష కేంద్రానికి వెళ్లగా అప్పటికే టైం దాటిపోయింది. దీంతో అక్కడి అధికారులు ఆమెను లోనికి అనుమతించలేదు. దీంతో ఆమె చేసేదిలేక కన్నీటి పర్యంతమయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *