Telangana: లక్షకు పది లక్షలు ఇస్తామన్నారు.. సరే అని రూ.6 లక్షలు ఇస్తే.. 

Telangana: లక్షకు పది లక్షలు ఇస్తామన్నారు.. సరే అని రూ.6 లక్షలు ఇస్తే.. 


మోసపోయేవాళ్ళుంటే మోసాలు చేసేందుకు కేటుగాళ్ళు కొత్తకొత్త ఎత్తులు వేస్తుంటారు. మా దగ్గర పెట్టుబడులు పెడితే నెలరోజుల్లోనే రెండింతలు ఇస్తాం.. ఏడాదికి పదిరెట్లు ఇస్తామంటూ ఇంతకాలం మోసం చేసిన కేటుగాళ్ళు ఇప్పుడు గుప్త నిధులు ఉన్నాయని నమ్మేవాళ్ళను టార్గెట్‌ చేస్తున్నారు. నల్లమల అడవిలో గుప్తనిధులు ఉన్నాయని, వాటిని వెలికి తీసేందుకు పెట్టుబడులు పెడితే ఒకటికి పదింతలు లాభం ఇస్తామని ఆశచూపిస్తూ లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు.. ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘరానా మోసం ఒకటి వెలుగు చూసింది.

అత్యాశకు వెళ్లి గుప్త నిధుల గ్యాంగ్‌కు ఫోన్ పే ద్వారా విడతల వారీగా రూ.6 లక్షల రూపాయలను ఇచ్చి మోసపోయానని ఓ వ్యక్తి ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీసులను ఆశ్రయించాడు. పట్టణంలోని స్థానిక విద్యానగర్‌కు చెందిన ముటుకుల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఫిర్యాదుతో ఏడుగురు గుప్తనిధుల గ్యాంగ్‌ను గుర్తించి అందులో ఆరుగురును అరెస్టు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని నల్లమల అడవిలో గుప్త నిధులు ఉన్నాయంటూ చెప్పిన వ్యక్తుల మాటలు నమ్మి మోసపోకుండా, అప్రమత్తంగా మెలిగి అటువంటి సమాచారాన్ని పోలీసులకు తెలపాలన్నారు.

ఎలా మోసం చేస్తారంటే…

తన పొలంలో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఓ వ్యక్తి నుంచి ఆరు లక్షలకు టోకరా వేసిన ఘటనపై మార్కాపురం పట్టణ పోలీసు స్టేషన్లో సోమవారం రాత్రి కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన ముటుకుల సుబ్రహ్మణ్యం ఓ న్యాయవాది దగ్గర గుమస్తాగా పనిచేస్తున్నాడు. పెద్దారవీడు మండలం కలనూతలకు చెందిన గోదా నడిపయ్య కోర్టు కేసులపై వచ్చిన సందర్భంలో సుబ్రహ్మణ్యంతో పరిచయం ఏర్పడింది. తన పొలంలో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని తవ్వేందుకు తన వద్ద అంత నగదు లేదని, వాటిని తవ్వి తీసిన తర్వాత నీవు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు నగదు ఇస్తానని నడిపయ్య నమ్మబలికాడు. ఇది నిజమని నమ్మిన సుబ్రహ్మణ్యం ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబరు వరకు విడతల వారీగా రూ.6 లక్షల నగదును నడిపయ్యకు చెల్లించారు. ఎంతకీ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అనంతరం మోసపోయినట్లు గ్రహించి, తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా ఫలితం లేకపోయింది. దీంతో సుబ్రహ్మణ్యం పోలీసులను ఆశ్రయించడంతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఒక రోజు వ్యవధిలోనే గుప్తనిధుల ముఠాను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *