ఆదివారం మంచి చేపలు చిక్కితే.. నాలుగు కాసులు ఎక్కవ వస్తాయ్ అని ఆశపడ్డారు జాలర్లు. ఎంతో హుశారుగా వెళ్లి.. వలలు వేశారు. ఓ వల బరువుగా అనిపించడంతో.. దండిగా చేపలు పడ్డాయని సంబరపడ్డారు. కానీ బయటకు లాగి చూడగా.. వారి ఆశలు గల్లంతయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో ఆదివారం పొద్దుపొద్దున్నే వలలో కొండ చిలువ ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం జొన్నలబగడ జలాశయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గడచిన కొన్ని నెలల నుంచి కోడి, మేక మాంసం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ తరుణంలో సండే నాన్ వెజ్‌ను తక్కువ ఖర్చుతో ముగించాలనుకుంటే మాత్రం ఫిష్ వైపు మొగ్గు చూపాల్సిందే. అయితే ప్రస్తుతం ఉన్న డిమాండ్ నేపథ్యంలో చేపలను పెద్ద మొత్తం అమ్మాలని ముందురోజు రాత్రే జలాశయంలో వలలు వేసి ఉంచారు జొన్నలబగడ జలాశయం మత్స్యకారులు. అయితే పొద్దునే వెళ్లి చూసేసరికి వల బరువెక్కింది. పెద్ద మొత్తంలో చేపలు పడి ఉంటాయని భావించారు. కోటి ఆశలతో వలను బయటకు లాగారు. అయితే మత్స్యకారుల ఆశలు అడియాశలయ్యేలా ఓ పెద్ద కొండ చిలువ దర్శనం ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
కాసేపటి తర్వాత అప్రమత్తమై మత్స్యకారులు కొండ చిలువను వల నుంచి తప్పించారు. అనంతరం ఎలాంటి హానీ తలపెట్టకుండా జలాశయం ఒడ్డున తాళ్ళతో బంధించారు. సుమారు 15 అడుగుల పొడవు ఉన్న కొండచిలువ చిక్కిన అంశాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దానికి ఎలాంటి అపాయం కలగకుండా మత్స్యకారులు కాపల ఉన్నారు. ఇక ఒడ్డున ఉన్న ఈ భారీ కొండ చిలువను చూసేందుకు చేపల కోసం వచ్చిన వారు, పరిసర గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలిచ్చారు. కాగా అటవీ సిబ్బంది వచ్చి ఆ కొండ చిలువన తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు.
వీడియో దిగువన చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి