వికారాబాద్, డిసెంబర్ 13: కొడుకు మరణ వార్త విన్న ఓ తల్లి తల్లడిల్లింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతున్న కొడుకు ఎప్పటికైనా తిరిగొచ్చి అమ్మా.. అంటూ నోరార పిలుస్తాడని ఆశగా ఎదురు చూసింది. కానీ ఆమెకు తీవ్ర నిరుత్సాహమే మిగిలింది. మరణశయ్యపై కొడుకు మృతి చెందాడనే విషయం తెలియగానే తల్లి కూడా కొడుకు శవం పక్కనే కుప్పకూలి మరణించింది. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని లింగంపల్లిలో జరిగింది. వివరాల్లోకెళ్తే..
లింగంపల్లికి చెందిన మ్యాకల శ్రీశైలం (34) అనే వ్యక్తి గత నెల 24న పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతను ఒక వీడియోలో తన చావుకు కారణం వివరించాడు. లింగంపల్లికి చెందిన బాల్‌రాజ్, లక్ష్మణ్, రాములు కలిసి భూ తగాదాలతో తనను వేధిస్తున్నారని అంతకు ముందే సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడగా.. కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు.
శ్రీశైలం చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. శ్రీశైలం మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే అతని తల్లి వెంకటమ్మ (52) కూడా కొడుకు శవం వద్ద కుప్పకూలి మృతి చెందింది. అక్కడున్నవారు చూస్తుండగానే ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో తల్లీ కొడుకుల అంత్యక్రియలను గ్రామస్థులు ఒకేసారి నిర్వహించారు. శ్రీశైలం ఆత్మహత్యకు కారణమైన బాల్‌రాజ్, లక్ష్మణ్, రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి, శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. బాల్‌రాజ్, లక్ష్మణ్ రాములును పోలీసులు పరిగి సబ్‌జైలుకు పంపించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.