Telangana: ఓర్నాయనో.. మోపయ్యారేంట్రా.. పార్ట్‌టైం జాబ్ పేరిట మహిళకు ఫోన్.. కట్ చేస్తే..

Telangana: ఓర్నాయనో.. మోపయ్యారేంట్రా.. పార్ట్‌టైం జాబ్ పేరిట మహిళకు ఫోన్.. కట్ చేస్తే..


సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. రోజుకో కొత్త రకం నేరాలతో ప్రజల నుంచి దోచుకుంటున్నారు.. ఏదో ఒకరకంగా నమ్మించి వారి బ్యాంక్ అకౌంట్స్ పూర్తిగా ఖాళీ చేస్తున్నారు. ఈ విషయాల పట్ల సరైన అవగాహన లేకపోవడంతో బాగా చదవుకున్న వారు కూడా సైబర్ నేరగాళ్ల బుట్టలో పడి.. విలవిలలాడుతున్నారు.. భారీగా డబ్బు పోగొట్టుకుని.. ఎవరికీ చెప్పుకోలేక.. తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తాజాగా.. సైబర్ నేరగాళ్లు ఓ మహిళను టార్గెట్ చేసి.. భారీగా డబ్బును దండుకున్నారు. ఆన్‌లైన్‌లో పార్ట్‌టైం ఉద్యోగం పేరుతో మహిళకు వల విసిరారు. వారి మాటలు నమ్మిన ఆమె రూ.31.60 లక్షలు నష్టపోయింది..

రామగుండం సైబర్‌ క్రైం ఏసీపీ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ వివాహిత మొబైల్ కు ఆన్‌లైన్‌లో పార్ట్‌టైం ఉద్యోగం ఉన్నట్లు గత అక్టోబరులో సందేశం వచ్చింది. దీంతో ఆమె అందులో ఉన్న నంబరును సంప్రదించింది.. దీంతో సైబర్ నేరస్తులు ప్లాన్ ను రచించారు.. ఉద్యోగం పొందేందుకు, ఉద్యోగ ధ్రువీకరణకు కొంతమొత్తం డిపాజిట్‌ చేయాలని వివరించారు.. దీంతో మహిళ వారి ఖాతాలకు పలు దఫాలుగా నగదు పంపించింది.

ఇదే అదునుగా భావించిన నేరస్తులు మరో ప్లాన్ ను రచించారు.. కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ పేరిట నకిలీ ఖాతా చూపి.. ఆమె ఖాతాలో ఎక్కువ మొత్తంలో నగదు ఉన్నట్లు నమ్మించారు.. ఆ సొమ్ము తీసుకోవాలంటే 30 శాతం పన్ను చెల్లించాలని చెప్పారు.. దీంతో సైబర్ నేరస్థుల మాటలను నమ్మిన ఆ మహిళ వారు సూచించిన ఖాతాలోకి పలు దఫాలుగా రూ.31,60,900 పంపించింది.. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించిన బాధిత మహిళ అక్టోబరు 21న రామగుండంలో సైబర్‌ క్రైం పోలీసులను సంప్రదించింది..

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సైబర్ పోలీసులు.. హైదరాబాద్‌లోని మహమ్మద్‌ అవాద్‌ అనే వ్యక్తి ఖాతాల నుంచి లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.. అనంతరం విచారించగా.. తన పేరిట కొందరు మూడు బ్యాంకు ఖాతాలు తెరిచారని, డ్రా చేసి ఇస్తే రూ.లక్షకు రూ.300 కమీషన్‌ ఇస్తానని చెప్పడంతో ఒప్పుకున్నట్లు మహమ్మద్‌ అవాద్‌ పోలీసులకు తెలిపాడు. గృహిణికి సంబంధించిన మొత్తం సొమ్మును సైబర్‌ నేరస్థులు అవాద్‌ ఖాతాల నుంచి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

శనివారం సైబర్‌ క్రైం పోలీసులు హైదరాబాద్‌లో మహమ్మద్‌ అవాద్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *