Venus Transit: శనీశ్వరుడు అధిపతి అయిన మకర, కుంభ రాశుల్లో శుక్రుడి సంచారం వల్ల జనవరి ఆఖరు వరకు ఆరు రాశులకు జీవితం అద్భుతంగా ఉండబోతోంది. శుక్రుడికి మకర, కుంభ రాశులు అత్యంత ప్రీతిపాత్రమైన రాశులు. అందువల్ల మకర, కుంభరాశులతో పాటు మిథునం, కర్కాటకం, వృషభం, తులా రాశుల వారికి రెండు నెలల పాటు నిత్య కల్యాణం, పచ్చ తోరణంలా సాగిపోయే అవకాశం ఉంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- వృషభం: రాశ్యధిపతి శుక్రుడి అనుకూల సంచారం వల్ల జీవితంలో అనేక విధాలైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ జీవితంలో ఊహించని అధికార యోగాలు పడతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులతోపాటు ఉద్యోగాలకు కూడా విదేశీ అవకాశాలు లభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా బాగా లాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కూడా లాభాలు గడిస్తాయి.
- మిథునం: ఈ రాశికి ఆధిపత్యాలకారణంగా అత్యంతశుభుడైన శుక్రుడు బాగా అనుకూల స్థానంల్లో సంచారం చేస్తున్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో డిమాండ్ బాగా పెరగడంతోపాటు, ఊహించని పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యో గాల రీత్యా విదేశాలకు వెళ్లడం కూడా జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.
- కన్య: ఈ రాశికి ధన, లాభాధిపతి అయిన శుక్రుడు తన మిత్రక్షేత్రాలైన మకర, కుంభ రాశుల్లో సంచారం చేస్తున్నందువల్ల కొత్త ఏడాది ఈ రాశివారికి అన్ని విధాలా శుభారంభం అవుతుంది. ముఖ్యంగా ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంటుంది. వారసత్వ సంపద లభిస్తుంది. ఆస్తి వివాదాలు లేదా కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. మానసిక ఒత్తిడి కలిగిస్తున్న ముఖ్యమైన సమస్యలన్నిటి నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది.
- తుల: రాశ్యధిపతి శుక్రుడు బాగా అనుకూలంగా ఉండడంతో ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని పురోగతి కలుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. జీవనశైలి మారిపోతుంది. సుఖ సంతోషాలకు లోటుండదు.
- మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఊహించని శుభ వార్తలు వింటారు. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. అనేక ఆర్థిక అవసరాలు, ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శుభ కార్యాలు నిర్వ హించడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి, సమస్యల నుంచి పూర్తిగా బయటపడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- కుంభం: ఈ రాశికి శుక్రుడు ఏలిన్నాటి శని ప్రభావం నుంచి ఉపశమనం కలిగిస్తాడు. రెండు నెలల పాటు ఈ రాశివారి జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంలా సాగిపోతుంది. ఆదాయం బాగా పెరుగు తుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. కుటుంబ జీవితంలోనూ, దాంపత్య జీవితంలోనూ అనుకూలతలు, అన్యోన్యతలు బాగా వృద్ధి చెందుతాయి.