హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుల్లో ఒకటి శని త్రయోదశి. ఈ రోజు శివ కేశవులతో పాటు శనిశ్వరుడికి అంకితం చేయబడింది. అంటే శనివారం రోజున త్రయోదశి తిధి వస్తే.. ఆ రోజుని శని త్రయోదశి అని అంటారు. శనివారం శనిశ్వరుడికి, విష్ణువు, ఇష్టమైన రోజు అయితే.. త్రయోదశి తిధి శివుడికి ఇష్టమైన తిది.. కనుక ఈ రెండిటి కలయికతో వచ్చే శని త్రయోదశికి విశిష్ట స్థానం ఉంది. ఎవరైతే ఈ త్రయోదశి నాడు ఉపవాసం ఉంటారో వారి కోరికలన్నీ నెరవేరుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శని త్రయోదశి రోజున శివపార్వతులతో పాటు శనిశ్వరుడిని కూడా పూజిస్తారు.
వేద పంచాంగం ప్రకారం శని త్రయోదశి డిసెంబర్ 28వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:28 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో శని త్రయోదశి డిసెంబర్ 29వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3.32 గంటలకు ముగుస్తుంది. శని త్రయోదశి శనివారం వస్తుంది. కనుక ఈ శని త్రయోదశి పూజను డిసెంబర్ 28వ తేదీనే చేయాల్సి ఉంటుంది. ఇక ఈ రోజుని శని ప్రదోష వ్రతం అని కూడా అంటారు. హిందూ మత గ్రంధాల ప్రకారం శని త్రయోదశి (ప్రదోష వ్రతం) వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం.
శని త్రయోదశి వ్రతం వెనుక కథ
పురాతన కాలంలో ఒక వ్యాపారి తన కుటుంబంతో ఒక నగరంలో నివసించాడు. పెళ్ళైన ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ వ్యాపారికి సంతానం కలగలేదు. ఈ కారణంగా వ్యాపారి దంపతులు ఎప్పుడూ విచారంగా ఉండేవారు. ఒక రోజు ఈ దంపతులు సంతానం కోసం తీర్థయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనంతరం శుభ ముహూర్తంలో ఇద్దరూ తీర్ధయాత్రకు బయలు దేరారు. అలా కొంతదూరం వెళ్ళిన అనంతరం ఈ దంపతులకు ఒక సాధువు దర్శనం అయింది.
ఇవి కూడా చదవండి
మహర్షిని చూడగానే దంపతులు ఇద్దరూ ఆశీర్వాదం కోసం ఆగారు. ఆ సమయంలో మహర్షి ధ్యానంలో మునిగి ఉన్నాడు. కొంత సమయం తరువాత రుషి ధ్యానం పూర్తయింది. ధ్యానం నుంచి లేచిన ఋషికి దంపతులు నమస్కరించారు. వ్యాపారి దంపతుల ప్రవర్తనకు ఋషి చాలా సంతోషించాడు. దీని తరువాత ఈ దంపతులు తాము తీర్థయాత్ర చేయడానికి గల కారణాన్ని ఋషికి చెప్పారు.
శని త్రయోదశి రోజున ఉపవాసం ప్రాముఖ్యత
వ్యాపారి దంపతుల వ్యధ్యను సంతానం కోసం వారు పడుతున్న బాధను చూసిన తర్వాత.. ఋషి వారిద్దరికీ శని త్రయోదశి ఉపవాసం, దాని ప్రాముఖ్యత గురించి చెప్పాడు. ఈ వ్రతాన్ని ఆచరించమని కూడా ఋషి ఇద్దరికీ సలహా ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ తీర్థయాత్రలకు వెళ్లారు. తీర్ధ యాత్రలను ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత దంపతులు ఇద్దరూ శనిత్రయోదశి వ్రతాన్ని ఆచరించి శివుని పూజించారు. కొంత కాలం తర్వాత వ్యాపారి భార్య గర్భం దాల్చి మంచి సంతానానికి తల్లి అయింది. ఈ విధంగా శని త్రయోదశి (ప్రదోష వ్రతం) ప్రభావం కారణంగా వ్యాపారి దంపతులు సంతానం పొందారు. సంతానం లేని వారు శని త్రయోదశి రోజున పూజ చేయడం ఉపవాసం ఉండడం ఫలవంతం అని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.