విశాఖపట్నం, డిసెంబర్ 25: దక్షిణకోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం (డిసెంబర్ 25) బలపడింది. ఇది పశ్చిమ – నైరుతి దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు ఉత్తర భారతం మీదుగా వెళ్తున్న పశ్చిమద్రోణి అల్పపీడనాన్ని, తేమను తనవైపు లాగడానికి ప్రయత్నిస్తోందని వివరించింది.
దీనికి అనుబంధంగా నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. 3 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అంటే డిసెంబర్ 26 నుంచి 28వ తేదీ వరకు దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పారు. బుధవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో చలి తీవ్రత పెరుగుతుందని పేర్కొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.
అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, శనివారం తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని తెల్పింది. ఇక మంగళవారం అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ఏలూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం తదితర జిల్లాల్లో చలిగాలుతో కూడిన తేలికపాటి వర్షాలు కురిశాయి. తీరప్రాంత జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. కళింగపట్నం, విశాఖపట్నం, తుని, కాకినాడ, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి వంటి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 7 డిగ్రీల మేర తగ్గాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా మంగళవారం తిరుపతి జిల్లా సముద్ర తీరంలో అలలు ఎగసి పడుతూ కనిపించాయి. సుమారు 5 మీటర్ల ఎత్తుకు ఎగసి పడ్డాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి.