బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మంగళవారం కీలక ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. అనుబంధంగా ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. రానున్న 2 రోజుల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. బుధవారం, గురువారం ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయో తెలుసుకోండి..
డిసెంబర్ 18, బుధవారం : విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
డిసెంబర్ 19,గురువారం: శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
భారీ వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.