PM Modi – Gukesh: నరేంద్ర మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్.. ప్రధాని ఏమన్నారంటే..

PM Modi – Gukesh: నరేంద్ర మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్.. ప్రధాని ఏమన్నారంటే..


భారత చెస్ యువ సంచలనం గ్రాండ్ మాస్టర్.. దొమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్-2024 విశ్వ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.. ఇటీవల సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్ ఫైనల్ పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌, చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకున్నాడు పద్దెనిమిదేళ్ల కుర్రాడు గుకేష్.. ఈ విజయంతో గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేశ్ హిస్టరీ క్రియేట్‌ చేశాడు. 18 ఏళ్ల వయస్సులో 18వ ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా అవతరించిన గుకేష్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. కాగా.. గ్రాండ్‌మాస్టర్ డి గుకేష్ శనివారం తన కుటుంబంతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా అతి పిన్న వయసులోనే చారిత్రాత్మక ఘనత సాధించిన గుకేష్ ను ప్రధాని మోదీ స్వాగతించారు.. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గుకేష్, అతని కుటుంబసభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు..

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో జరిగిన సమావేశానికి సంబంధించిన ఫోటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.. ‘‘భారతదేశ చెస్ ఛాంపియన్ డి గుకేష్‌ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. గత కొన్నేళ్లుగా ఆయనతో సన్నిహితంగా మాట్లాడుతున్నాను.. అతనిలో నాకు ఎక్కువగా కనిపించేది అతని సంకల్పం.. అంకితభావం.. ఇవి నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అతని ఆత్మవిశ్వాసం నిజంగా స్ఫూర్తిదాయకం. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం నేను అతని వీడియోను చూశాను.. అక్కడ అతను అతి పిన్న వయస్కుడైన తాను ప్రపంచ ఛాంపియన్ అవుతానని చెప్పాడు. ఇప్పుడు తాను చెప్పినట్లు చేసి చూపించాడు..’’ అని మోదీ ఎక్స్ లో రాశారు.

ప్రధాని మోదీని కలిసిన గుకేష్ ఆయనకు చెస్ బోర్డును బహుమతిగా ఇచ్చారు. దీని గురించి మోడీ తన పోస్ట్‌లో కూడా రాశారు. గుకేష్ గెలిచిన చెస్ బోర్డును బహుమతిగా అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. గుకేష్-అతని ప్రత్యర్థి డింగ్ లిరెన్ ఇద్దరూ సంతకం చేసిన ఒక చెస్ బోర్డు.. ఒక ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకంగా నిలిచిపోనుంది అంటూ ప్రధాని మోదీ రాశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *