జమిలి ఎన్నికల బిల్లు మంగళవారం(డిసెంబర్ 17) పార్లమెంట్ ముందుకు రానుంది. నిజానికి సోమవారం రెండు బిల్లులు ప్రవేశపెడుతారని భావించరంతా. కానీ ఒకవైపు ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు.. మరోవైపు రాజ్యసభలో రాజ్యంగంపైన చర్చ నేపథ్యంలో బిల్లు రేపటికి వాయిదా పడింది. మంగళవారం ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు లోకసభలో ప్రవేశ పెట్టబోతున్నారు. మరి పార్లమెంట్‌లో మొగ్గు.. మోదం వైపా? ఖేదం వైపా? బలం సాధించే దిశగా ఎన్డీయే సర్కార్ ప్లానేంటి? అనేది ఆసక్తికరంగా మారింది.
జమిలి ఎన్నికల బిల్లుకు సంబంధించి మరో ట్విస్ట్. లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఒకే సారి నిర్వహించే విధంగా వన్ నేషన్- వన్ ఎలక్షన్ నినాదాన్ని తెరపైకి తెచ్చింది ఎన్‌డీఏ సర్కార్. ఇటీవలే జమిలి ఎన్నికల బిల్లును కేబినెట్ ఆమోదించింది. 129వ రాజ్యాంగ సవరణ, కేంద్ర పాలిత ప్రాంత చట్టాల సవరణ రెండు బిల్లులను సోమవారం ప్రవేశ పెడుతారనే చర్చ జరిగింది. కానీ లోక్‌సభ రివైజ్డ్ బిజినెస్ జాబితాలో ఆ రెండు అంశాల ప్రస్తావన లేదు. దాంతో వాయిదా అంశంపై తెరపైకి వచ్చింది. మంగళవారం విధిగా సభకు హాజరుకావాలని బీజేపీ ఎంపీలకు విప్ జారీ అయింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ మంగళవారం లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధమైంది.
జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు కనీసం 67 శాతం సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద ముద్రవేయాలి. అంటే 543 స్థానాలున్న లోక్‌సభలో కనీసం 67 శాతం అంటే.. 362 ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటువేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం అంటే 164 మంది సభ్యులు ఈ బిల్లును సమర్థించాలి. దీనికి తోడు కనీసం 14 రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉంది. అయితే లోక్‌సభలో ఎన్డీయేకు 293 మంది ఎంపీల మద్దతు వుంటే, ఇండియా కూటమికి 235 మంది ఎంపీలున్నారు. అయినా సరే బిల్లు పాస్ అవుతుందనే ధీమాతో ఉంది ఎన్‌డీఏ సర్కార్. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. పార్లమెంట్‌లో ఆమోదం పొందితే.. 2029నుంచే జమిలి ఎన్నికలు జరగనున్నాయి.
జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే వేళాయింది. నిజానికి ఇదే కొత్త కాదు. 1952, 1967లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించిన చరిత్ర వుంది. అయితే ఈసారి వన్ నేషన్- వన్ ఎలక్షన్‌పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. మంగళవారం పార్లమెంట్‌లో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జమిలి బిల్లు పాస్ కావడం ఖాయమని ధీమాగా వుంది ఎన్డీఏ. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు సంబంధించి ఎన్డీయేలోని అన్ని భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేవలం రాజకీయ కారణాలతోనే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు.
ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు లక్ష్యం దాని పేరులోనే ప్రతిబింబిస్తుంది. ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని ఎన్‌డీఏ ప్రభుత్వం కోరుతోంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం వెనుక అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ కొత్త పథకాన్ని అమలు చేయడానికి వీల్లేదు. ప్రవర్తనా నియమావళి సమయంలో, కొత్త ప్రాజెక్ట్‌లు, కొత్త ఉద్యోగాలు, కొత్త విధానాలను ప్రకటించలేరు.ఇది అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతుంది. దేశం అభివృద్ధిలో అడ్డంకులు ఎదుర్కోవాలి. ప్రతి రోజు దేశంలోని వనరులు ఖర్చు చేయడం జరుగుతుంది. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు రికరింగ్ ఎలక్షన్ డ్యూటీ నుంచి కూడా విముక్తి లభిస్తుందని పేర్కొంటున్నారు.
భారతదేశంలో, 1967 సంవత్సరం వరకు, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, కొత్త రాజ్యాంగం ప్రకారం దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1952 సంవత్సరంలో జరిగాయి. ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. అయితే 1957 ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలన విధించినందున, 1957లో కేరళలో వామపక్ష ప్రభుత్వం ఏర్పడటంతో ప్రత్యేక ఎన్నికల ధోరణికి బ్రేక్ పడింది. 1960లో కేరళలో మళ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే.. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు అంటూ పలు రాష్ట్రాల్లో అసెంబ్లీని ముందస్తుగా రద్దు చేస్తారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..