టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. న్యాయ సలహా అనంతరం FIRలో పోలీసుల సెక్షన్స్ మార్చిన విషయం తెలిసిందే. BNS 109 సెక్షన్ కింద మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు … మోహన్ బాబు అభ్యర్థనను నిరాకరించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో మోహన్ బాబుకి బిగ్ ఝలక్ తగిలినట్టైంది.
ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో గత మంగళవారం సాయంత్రం జల్ పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్‌కు వెళ్లారు మనోజ్. గేటుకు నెట్టుకుంటూ లోనికి వెళ్లారు. ఆ తర్వాత కాసేపటికీ తనపై దాడి జరిగిందంటూ మనోజ్ చిరిగిన చొక్కాతో బయటకు వచ్చి.. మీడియా ప్రతినిధుల ముందు తన బాధను వెళ్లగక్కే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మోహన్ బాబు నమస్కరిస్తూ బయటకు వచ్చారు. మోహన్ బాబుతో టీవీ9 ఛానెల్ ప్రతినిధి రంజిత్.. ”సర్.. చెప్పండి..” అనగానే.. మోహన్ బాబు దుర్భాషలాడుతూ మైకు లాక్కొని విచక్షణారహితంగా దాడి చేశారు. మోహన్‌బాబు దాడిలో టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. అతనికి జైగోమాటిక్ ఎముక దెబ్బతినడంతో డాక్టర్ల బృందం సరిచేసింది. ఈ దాడిపై జర్నలిస్టు లోకం భగ్గుమంది. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలంటూ.. నిరనసనలు భగ్గుమన్నాయి. దాడిపై అందిన ఫిర్యాదు మేరకు మోహన్ బాబుపై పహాడీషరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి