భారతదేశంలో మొత్తం మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ల సంఖ్య ఇప్పుడు 115.12 కోట్లకు చేరిందని పార్లమెంట్‌లో ఆ శాఖ మంత్రి తెలిపారు. దేశంలోని 6,44,131 గ్రామాలలో, 6,23,622 గ్రామాలకు ఇప్పుడు మొబైల్ కవరేజీ ఉందని సమాచార, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. జనావాసాలు లేని గ్రామాలకు మొబైల్ కవరేజీని ప్రభుత్వం, టెలికం సర్వీస్ ప్రొవైడర్లు (టిఎస్‌పి) దశలవారీగా అందిస్తున్నాయని ఆయన తెలిపారు. అలాగే దేశంలోని గ్రామీణ, మారుమూల, కొండ ప్రాంతాలలో మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా టెలికాం కనెక్టివిటీని విస్తరించడానికి ప్రభుత్వం డిజిటల్ భారత్ నిధి (డిబిఎన్) కింద వివిధ పథకాలు, ప్రాజెక్టులను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు.
డిజిటల్ భారత్ నిధి ద్వారా నిధులు సమకూరుస్తున్న భారత్ నెట్ ప్రాజెక్ట్ దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించడానికి దశలవారీగా అమలు చేస్తున్నాయి. భారత్‌నెట్ ఫేజ్-1, ఫేజ్-2 నెట్‌వర్క్‌ను అప్-గ్రేడేషన్ చేయడం, మిగిలిన దాదాపు 42,000 గ్రామ పంచాయతీలలో నెట్‌వర్క్‌ను సృష్టించడం, 10 సంవత్సరాల పాటు ఆపరేషన్, నిర్వహణ, వినియోగం కోసం క్యాబినెట్ ఆమోదించింది. ఈ ప్రాజెక్టులకు ఇప్పటికే 1,39,579 కోట్లు ఖర్చు చేసినట్లు డాక్టర్ పెమ్మసాని తెలిపారు. గత వారం గ్రామీణ భారతదేశంలో మొబైల్ నెట్‌వర్క్ కవరేజీ దాదాపు 97 శాతానికి చేరుకుందని, కనీసం 6,14,564 గ్రామాల్లో 4జీ మొబైల్ కనెక్టివిటీ ఉందని ప్రభుత్వం తెలియజేసింది.
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం కింద 4,543 ముఖ్యంగా హాని కలిగించే గిరిజన సమూహాల నివాసాలను మొబైల్ అన్‌కవర్డ్, అవుట్‌గా గుర్తించామని రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ పెమ్మసాని తెలిపారు. వీటిలో 1,136 పీవీటీజీ గృహాలు మొబైల్ కనెక్టివిటీతో కవర్ చేశామని వివరించారు. అలాగే దేశంలోని 783 జిల్లాల్లో ఇప్పుడు 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. దేశంలో 4.6 లక్షలకు పైగా 5జీ బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్‌లు (బీటీఎస్) స్థాపించినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి