కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి, మంచి సాహిత్య అభిమాని ఇలా చాలా రకాలుగా ఆయన గురించి ప్రజలకు తెలుసు. కానీ ఇది మాత్రం చాలామందికి తెలవని ఆసక్తికరమైన ఓ విషయం. మామూలుగా రాజకీయ నాయకులు విదేశీ పర్యటనలు తరచుగా చేస్తూ ఉంటారు. అందులోనూ అధికారంలో ఉంటే ఎక్కే విమానం.. దిగే విమానం ఉన్నట్లుగా ఫారిన్ టూర్స్ ఉంటాయి. ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కూడా ఐదేళ్లలో నాలుగు సార్లు అయినా ఏదో ఒక కార్యక్రమం పేరుతో అమెరికా వెళ్ళొస్తుంటారు. ఇక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులైతే చెప్పనక్కర్లేదు. కానీ కెసిఆర్ వీటన్నింటికీ విభిన్నం.. దేశంలోనే అత్యంత తక్కువ విదేశీ పర్యటనలు చేసిన ముఖ్యమంత్రి. రెండుసార్లు అధికారాన్ని చేపట్టిన ఆయన పర్యటించిన దేశాలు రెండు మాత్రమే. ఒకటి ముఖ్యమంత్రి అయిన కొత్తలో సింగపూర్ పర్యటించారు. రెండు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు చైనా పర్యటన చేశారు. ఇది మినహా ఆయన జీవితకాలంలో ఎప్పుడు దేశాన్ని దాటలేదు. ఇక అగ్రరాజ్యం అమెరికా అయితే ఒక్కసారి కూడా వెళ్లలేదు.
కానీ ఇప్పుడు అమెరికా వెళ్ళబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకటి రెండు నెలల్లో ఆయన అమెరికా ప్రయాణం ఉండబోతుంది. ప్రతిపక్ష నేతగా కొన్ని రోజులుగా కేసీఆర్ సైలెంట్ గా ఉంటున్నారు. మొదట్లో అనారోగ్య కారణాలు, ఆ తర్వాత ఫామ్ హౌస్ లోనే రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని అక్కడికే పరిమితమయ్యారు. ఇప్పుడు తాజాగా అమెరికా వెళ్లి నెల రెండు నెలలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కేసీఆర్ మనవడు హిమాన్షు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. హిమాన్షు కోరిక మేరకే తాత కేసీఆర్ అమెరికా వెళుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు యుఎస్ లో రెస్ట్ తీసుకోవాలని ఈ మధ్యకాలంలో ఇండియా వచ్చిన హిమాన్షు కోరినట్లు సమాచారం. ఇప్పటికే కేసీఆర్ అమెరికా వెళ్తే ఎక్కడ ఉండాలి, ఏ ప్రాంతాలు పర్యటించాలి, అక్కడున్న ఎన్నారై లతో సమావేశాలు ఇలా ఏర్పాట్లు ఇప్పటినుంచే మొదలుపెట్టారు పార్టీ నేతలు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..