IPL 2025 సీజన్‌కు సిద్ధమైన జట్లు తమ బలహీనతలను తగ్గించుకునేందుకు ప్రత్యేకంగా కృషి చేశాయి. అయితే, కొన్ని జట్లు ప్రత్యేకంగా పేస్ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయడంలో సఫలమయ్యాయి. పేస్ బౌలర్లు భాగస్వామ్యాలను విడదీయడం, డెత్ ఓవర్లలో నియంత్రణను కల్పించడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ కారణంగా పేస్ అటాక్ పటిష్ఠత IPL విజయానికి ఎంతో కీలకం.
గుజరాత్ టైటాన్స్
గుజరాత్ ఈ సీజన్‌లో పేస్ విభాగాన్ని గణనీయంగా మెరుగుపరిచింది. గత సీజన్‌లో వారి పేస్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపించగా, ఈసారి మహ్మద్ సిరాజ్, కగిసో రబడా, ప్రసిద్ధ్ కృష్ణల చేరికతో దాన్ని బలపరిచింది. అదనంగా గెరాల్డ్ కోయెట్జీ, ఇషాంత్ శర్మ, అర్షద్ ఖాన్‌లను బ్యాకప్‌లుగా తీసుకుని మరింత దృడంగా కనిపిస్తోంది. సిరాజ్, రబడా పవర్‌ప్లేలో ముమ్మర దాడిని ప్రారంభిస్తే, కృష్ణ మద్దతుగా నిలుస్తారు. డెత్ ఓవర్లలో కూడా ఈ త్రయం బాగా రాణించగలదు, అందువల్ల గుజరాత్ పేస్ దాడి సమతుల్యంగా ఉంటుంది.
ముంబై ఇండియన్స్
గతంలో జస్ప్రీత్ బుమ్రాపై ఎక్కువగా ఆధారపడ్డ ముంబై, ఈసారి ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్‌లను జట్టులో చేర్చింది. హార్దిక్ పాండ్యా కూడా పేస్ విభాగానికి సమతుల్యతను అందించి, బలాన్ని పెంచాడు. రీస్ టోప్లీ, లిజాద్ విలియమ్స్ వంటి బ్యాకప్‌లతో జట్టు మరింత పటిష్ఠంగా ఉంది. బుమ్రా, బౌల్ట్, చాహర్ పవర్‌ప్లేలో అద్భుతంగా రాణించగలరు, ఇక డెత్ ఓవర్లలో కూడా వారి ప్రదర్శన విశ్వసనీయంగా ఉంటుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్
IPL లో బౌలింగ్ ఎటాక్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు హైదరాబాద్. ఈ సీజన్‌లో దూకుడు బ్యాటింగ్ లైనప్‌తో పాటు గట్టి పేస్ అటాక్‌ను రూపొందించింది. పాట్ కమిన్స్‌ను నిలుపుకుని, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్‌లను జట్టులో చేర్చింది. షమీ, కమ్మిన్స్ పవర్‌ప్లేలో కీలక పాత్ర పోషిస్తే, డెత్ ఓవర్లలో హర్షల్ పటేల్ కీలకంగా వ్యవహరిస్తారు. షమీ, హర్షల్ ఇద్దరూ గతంలో పర్పుల్ క్యాప్ విజేతలు కావడం, జట్టుకు గొప్ప అనుభవాన్ని తెచ్చిపెట్టింది. బ్రైడాన్ కార్సే, జయదేవ్ ఉనద్కట్, సిమర్‌జీత్ సింగ్ వంటి బ్యాకప్‌లతో సన్‌రైజర్స్ పేస్ అటాక్ మరింత బలంగా కనిపిస్తోంది.
ఈ మూడు జట్లు తమ పేస్ బౌలింగ్ విభాగాలను పటిష్టం చేయడం ద్వారా IPL 2025లో విజయవంతమైన ప్రదర్శన కోసం సిద్ధంగా ఉన్నాయి. టోర్నమెంట్‌లో ఈ జట్ల పేస్ బౌలింగ్ ఎలా ప్రభావం చూపుతుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.