ఢిల్లీ, డిసెంబర్ 24: ఐఐటీ ఢిల్లీ విద్యార్ధులు ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఐఐటీ దిల్లీ విద్యార్థులు అదరగొట్టారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల చేపట్టిన నియామక ప్రక్రియలో ఏకంగా 1200మందికి పైగా విద్యార్థులు పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్లు (పీపీవో) అందుకున్నారు. ఈ మేరకు ఐఐటీ ఢిల్లీ వెల్లడించింది. గూగుల్, గోల్డ్‌మెన్ సాచ్స్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, బీసీజీ, బ్లూ స్టోన్ జ్యువెలరీ అండ్ లైఫ్‌స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటెల్ ఇండియా, మీషో, మైక్రాన్ టెక్నాలజీ, మైక్రోసాఫ్ట్, ఓలా, ఒరాకిల్, పీయూ, క్వాల్కమ్, షిప్‌రాకెట్, ట్రైడెంట్ గ్రూప్ తదితర ప్రఖ్యాత సంస్థల నుంచి ఉద్యోగ ఆఫర్లు పొందినట్లు వెల్లడించింది.
జపాన్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, తైవాన్, యూఏఈ, యూకే, అమెరికాతో పాటు పలు దేశాలకు చెందిన 15కి పైగా ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి 50కి పైగా అంతర్జాతీయ ఆఫర్లను ఐఐటీ ఢిల్లీ విద్యార్ధులు అందుకున్నారు. పేర్కొంది. విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ ఆఫర్లు రావడంపై ఐఐటీ ఢిల్లీ కెరీర్ సర్వీసెస్ కార్యాలయం (OCS) ఇంఛార్జి ప్రొఫెసర్ నరేష్ వర్మ హర్షం వ్యక్తం చేశారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఈ ఏడాది ఆరంభం బాగుందని, రాబోయే రోజుల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
తమ క్యాంపస్ విద్యార్థుల ప్రతిభా పాటవాలను గుర్తించినందుకు రిక్రూటర్లకు ఓసీఎస్‌కు చెందిన ప్రొఫెసర్ సురేష్ నీలకంఠన్ కృతజ్ఞతలు చెప్పారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగ ఆఫర్లు పొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ ప్లేస్‌మెంట్స్ సీజన్ వచ్చే సెమిస్టర్ ఆఖరి వరకు కొనసాగనుందని ఐఐటీ ఢిల్లీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, విద్యార్థులు సాధించిన ఉద్యోగాల వార్షిక ప్యాకేజీలను మాత్రం వెల్లడించలేదు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.