హైదరాబాద్, డిసెంబర్ 16: హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అల్పపీడన ప్రభావంతో ఉదయం, రాత్రి వేళల్లో చలిపంజా విసురుతోంది. గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతంగా కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలితీవ్ర వల్ల రాత్రి 9 గంటల తర్వాత హైదరాబాద్ నగరంలో చాలా వరకు రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం 7 గంటల తర్వాతగానీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో అత్యల్పంగా 6.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
ఆ తర్వాత స్థానంలో నిర్మల్ జిల్లా తాండ్రలో 6.6, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 6.7, సంగారెడ్డి 6.8, కామారెడ్డి 7.6, నిజామాబాద్ 7.7, మెదక్ 8, జగిత్యాల 8, వికారాబాద్ 8.2, రాజన్నసిరిసిల్ల 8.6, సిద్దిపేట 8.6, రంగారెడ్డి 8.9, పెద్దపల్లిలో 9.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణశాఖ వెల్లడించింది. ఇలా పలు జిల్లాల్లో 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలోనూ పలు చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హెచ్‌సీయూ, మౌలాలీలో అత్యల్పంగా 7.1 డిగ్రీలు నమోదవగా ఉప్పల్ 13.4, మల్లాపూర్ 13.5, ఆదర్శ్‌నగర్ 13.5, తిరుమలగిరి, చర్లపల్లి 13.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బీహెచ్‌ఈఎల్‌లో 7.4, గచ్చిబౌలి 9.3, శివరాంపల్లి 10.3, జీడిమెట్ల 11.4, బాలానగర్ 11.5, పటాన్‌చెరు 11.7, లింగంపల్లి 11.8, బోయిన్‌పల్లి 11.9, బేగంపేట 12, ఆసిఫ్‌నగర్ 12, నేరెడ్‌మెట్ 12.1, లంగర్‌హౌస్ 12.2, మోండా మార్కెట్ 12.4, చందానగర్ 12.7, షేక్‌పేట 12.8, మాదాపూర్ 12.8, కూకట్‌పల్లి 13.1, గోల్కొండ 13.2, సఫిల్‌గూడ, హయత్‌నగర్ 13.3 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావతంతో చలిగాలులు విజృంభిస్తున్నాయి. దీంతో గత ఆరేళ్లలో ఎన్నడూలేని విధంగా ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. ఉత్తరాది నుంచి ఈదురుగాలులు, శీతల పవనాలు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.