Hyderabad: ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడుల్లో బయటపడ్డ భయంకరమైన వాస్తవం..!

Hyderabad: ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడుల్లో బయటపడ్డ భయంకరమైన వాస్తవం..!


మీరు చదివింది నిజమే మరి..! ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో చాలా చోట్ల అలాంటి టీ నే దొరుకుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు జరిపిన దాడుల్లో భయంకరమైన వాస్తవం బయటపడింది.

కాచిగూడలోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా కల్తీ టీ పౌడర్ తయారు చేస్తున్న బండారాన్ని ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారుల బృందం బయటపెట్టింది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఛాయ్‌పత్తా అసలు రంగు ఆకస్మిక తనిఖీతో వెలుగులోకి వచ్చింది. ఒక కిలో.. రెండు కిలోలు కాదు, ఏకంగా నాలుగు క్వింటాళ్ల కల్తీ టీ పొడర్ బాగోతం గుట్టురట్టైంది. దీని విలువ మార్కెట్లో దాదాపు లక్ష రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కల్తీ ఛాయ పత్తి మాఫియా గ్యాంగ్ లీడర్ మహేష్ గిరి అనే వ్యక్తిని ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చారు.

కాచిగూడలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మహేష్ గిరి మరి కొందరితో కలిసిఈ కల్తీ ఛాయ్‌పత్తా దందాకు తెర తీశారు. బేగంబజార్ లో చాయ్ పత్తాని కొన్న తర్వాత కాచిగూడలోని అద్దె ఇంట్లోకి తీసుకొచ్చి అందులోని కొన్ని పదార్థాలను మిక్స్ చేసి ఫుట్ పాత్‌లపై ఉండే ఛాయ్ దుకాణాలకు ఈ ఛాయపత్తాను అమ్ముతారు. ఈ కల్తీ ఛాయపత్తిలో క్యాన్సర్ కారకమైన అతి భయకరమైన క్యాసినోజెనిక్ అనే పదార్థం ఉన్నట్లుగా ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించారు.

ఈ టీపొడిని టిష్యూ పేపర్ పైన వేసి దానిపై తాగే నీరు వేసినప్పుడు పేపర్ మొత్తం రెడ్ కలర్‌గా మారిపోయింది. సాధారణంగా టీ పొడి పై నీరు పోసినప్పుడు ఎలాంటి కలర్లు విడుదల చేయదు అన్నది ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్న మాట. ఇంటిలో తయారు చేస్తున్న దాదాపు నాలుగు క్వింటాళ్ల ఛాయపత్తాను మొత్తం అధికారులు సీజ్ చేసి, చివరికి ఇంటికి తాళం వేసి సీలు వేశారు. ఈ కల్తీ దందాపై కేసు నమోదు చేసిన అధికారులు, మహేష్ గిరికి నోటీసులు జారీ చేశారు. కల్తీ చాయ్ పత్తి శాంపిల్స్ సేకరించి నాచారంలోని ఫుడ్ సేఫ్టీ స్టేట్ లేబొరేటరీకి పంపించారు.

ఈ మ్యాటర్ చదివిన మీ అందరికీ టీవీ9 సూచన.. ఎప్పుడైనా ఎక్కడన్నా టీ తాగే దగ్గర డౌట్ వస్తే మాత్రం ఛాయ పత్తాను వైట్ టిష్యూ పేపర్ పైన వేసి దానిపై తాగే నీరు వేస్తే కలర్ మారితే అది కన్ఫామ్ గా కల్తీ చాయ్ పత్తా అని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు..!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *