హైదరాబాద్ మహానగరంలో ఉన్న ప్రతిష్టాత్మక నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి సింహం బయటికి వచ్చినట్లు కనిపిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింహం జనావాస ప్రాంతాల్లోకి వచ్చిందని.. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ఖాతాల్లో పెద్దఎత్తున పోస్టులు రావడంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పోస్టులను చూసిన కొందరు ప్రజలు భయభ్రాంతులకు గురి కావడంతో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ దీనిపై క్లారిటీ ఇచ్చింది.
నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి సింహం బయటికి రావడం అనేది నిజం కాదు అని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిణి స్పష్టం చేశారు. త్వరలో ‘లయన్ కింగ్’ అనే ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని.. దాని గురించి చిన్నపిల్లలకు, ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే ఉద్దేశ్యంతో జూ పార్క్ తరపున సింహం ఉన్న ఒక వీడియో రికార్డు చేయడం జరిగిందని ఆమె అన్నారు. కానీ, సోషల్ మీడియాలో పెట్టే క్రమంలో ఆ వీడియో పూర్తిగా అప్ లోడ్ కాలేదని, ఆ చిన్న తప్పుతో సింహం బయటికి వచ్చిందన్నట్లు వదంతులు వ్యాపించాయని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ దీని గురించి భయపడాల్సిన పని లేదని.. జూలో ఉన్న సింహాలు అన్నీ సురక్షితంగా లోపలే ఉన్నాయని చెప్పారు.
సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం జూ పార్క్ తరపున ఒక టీమ్ పని చేస్తుందని.. వారు పొరపాటున చేసిన పని వల్లే ఈ తప్పిదం జరిగిందని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిణి అన్నారు. దయచేసి ప్రజలు ఎవరూ ఈ వీడియోని నమ్మవద్దని.. అందులో ఎలాంటి నిజం లేదని.. ఎవరూ ఎలాంటి భయాలు పెట్టుకోరాదని అధికారిణి వెల్లడించారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..