Himachal Pradesh: మంచు కురిసే వేళలో.. మురిసిపోతోన్న ప్రకృతి ప్రియులు

Himachal Pradesh: మంచు కురిసే వేళలో.. మురిసిపోతోన్న ప్రకృతి ప్రియులు


హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రకృతి మంచు దుప్పటి కప్పుకుని మెస్మరైజ్ చేస్తోంది. కనులారా చూసి, మనసారా తరించమని ప్రకృతి ప్రియులను నిండు మనస్సుతో పిలుస్తోంది. సిమ్లాలో పాల నురగల్లాంటి మంచు అందాలు టూరిస్టుల మనసును దోచేస్తున్నాయి.  ప్రకృతి రమ్యత… ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అని ఊహించి అందమైన పెయింటింగ్ గీసినట్లు కనిపిస్తున్నాయి హిమాచల్‌లోని గిరి ప్రాంతాలు. అంతటి మనోహర ప్రకృతి వైభవాన్ని చూసి ముగ్ధులవుతున్నారు టూరిస్టులు. మంచువానలో ఓలలాడుతూ.. ఇది కదా భూలోక స్వర్గం అని మురిసిపోతున్నారు.

హిమాచల్‌లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మరో వారం రోజుల పాటు సిమ్లాలో మంచుతీవ్రత పెరుగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఉనా, హమీర్‌పూర్‌, చంబా, మండి జిల్లాల్లో కూడా చలితీవ్రత పెరిగింది. పలు ప్రాంతాలకు వాతావరణశాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మంచు సీజన్‌ ప్రారంభం కావడంతో యాపిల్‌ పండించే రైతులు సంతోషంగా ఉన్నారు. దేశం నలుమూలల నుంచి టూరిస్టులు హిమాచల్‌కు చేరుకుంటున్నారు. మైనస్​ డిగ్రీల చలికి వణికిపోతున్నా.. చలిమంటలు కాచుకుంటూ వెచ్చదనాన్ని పొందుతున్నారే కానీ, ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలనిపించడం లేదంటున్నారు. మనాలిలో మంచు కురియడంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ సైతం సంతోషం వ్యక్తం చేశారు. టూరిస్టుల రాకతో రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందన్నారు.

చెట్లు, ఇళ్లు, వాహనాలు, రోడ్లు ఇలా అన్నింటినీ మంచు కప్పేయడంతో అధికారులు అలర్ట్‌ జారీ చేశారు. అధిక మంచు వల్ల రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు సంభవించే అవకాశాలు ఎక్కువే. అందుకే పర్వత ప్రాంతాల్లో తిరిగే పర్యటకులు, స్థానికులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

మరోవైపు జమ్ముకశ్మీర్‌లో కూడా ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. మంచుతో కొత్త అందాలను సంతరించుకున్నాయి కొండ ప్రాంతాలు. ఎటుచూసినా మంచు కనువిందు చేస్తోంది. దీంతో శ్రీనగర్‌తో సహా పలు ప్రాంతాలకు టూరిస్టులు పోటెత్తారు. గుల్‌మార్గ్‌లో మంచు క్రీడలు ఊపందుకున్నాయి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *