Guinness Records: ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ఆ ఇంట్లో నలుగురికి గిన్నిస్ బుక్‌లో చోటు!

Guinness Records: ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ఆ ఇంట్లో నలుగురికి గిన్నిస్ బుక్‌లో చోటు!


ప్రపంచంలో ఎవరూ సాధించలేని ఘనకార్యాలు చేసినవారికి ప్రపంచ రికార్డుల్లో స్థానం లభిస్తుంది. అలాంటి ఘనకార్యాలను నమోదు చేయడంలో “గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్” అగ్రగామి. సాహస క్రీడలు సహా వివిధ రంగాల్లో ఎవరూ సాధించని ఘనత సాధించినవారు ఇందులో చోటు సంపాదిస్తూ ఉంటారు. గిన్నిస్‌లో చోటు లభించడం అంటే వారు ప్రపంచ స్థాయి సెలబ్రిటీ అయినట్టే..! అలాంటి గిన్నిస్ బుక్‌లో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ఆ ఇంట్లో ఉన్న నలుగురూ చోటు సంపాదించారు. ప్రపంచ రికార్డుల ఘనత సాధించిన ఆ నలుగురూ తెలుగువారే కావడం విశేషం.

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చెందిన కొణతాల విజయ్ వృత్తిరీత్యా యోగా టీచర్. హైదరాబాద్‌లో కొన్నాళ్లు పనిచేసిన తర్వాత చైనాలో యోగా బోధన అవకాశం లభించడంతో అక్కడికి కుటుంబంతో సహా వెళ్లారు. అక్కడి పాఠశాల విద్యార్థులు, క్రీడాకారులతో పాటు వివిధ వర్గాల వారికి యోగా బోధిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో యోగాలోనే ఎవరూ సాధించని ఫీట్ చేసి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకోవాలని భావించారు. అప్పటి వరకు ఉన్న గిన్నిస్ రికార్డులను చూసి, వాటిని అధిగమించడం కోసం సాధన మొదలుపెట్టారు. అష్టవక్రాసనం, మయూరాసనం, బాకాసనం వంటి ఆసనాల భంగిమలో అత్యధిక సమయం ఉండడంతో పాటు సుదీర్ఘ యోగా సెషన్ నిర్వహించి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించారు. గిన్నిస్‌తో పాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబుల్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా విజయ్ ప్రదర్శించిన క్లిష్టమైన యోగా భంగిమలకు గుర్తింపు లభించింది.

నిండు గర్భంతో సాహసాలు

తాను మాత్రమే గిన్నిస్ రికార్డు సాధించడంతో విజయ్ సరిపెట్టుకోలేదు. తనతో పాటు అతని భార్య జ్యోతి కూడా యోగా సాధన చేస్తుండడంతో ఆమెతోనూ రికార్డులు సృష్టించాలనుకున్నారు. అయితే అప్పటికే ఆమె గర్భవతి కావడంతో 9 నెలల నిండు గర్భంతో క్లిష్టమైన యోగాసనాలను ప్రదర్శించారు. సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు శారీరక శ్రమ ఉండరాదని ప్రజలు భావిస్తూ ఉంటారు. అయితే వైద్యుల పర్యవేక్షణలో యోగా చేయడం గర్భంలో ఉన్న శిశువుతో పాటు తల్లికి క్షేమం అని సందేశం పంపడం కోసం ఆయన ఈ దంపతులు సాహసానికి పూనుకున్నారు. డెలివరీకి 5 రోజుల ముందు వివిధ యోగా భంగిమలను ప్రదర్శించిన జ్యోతి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించారు.

తల్లిదండ్రుల బాటలో…

తమది కాని దేశంలో ఉద్యోగం కోసం వచ్చిన తల్లిదండ్రులిద్దరూ రికార్డులు సృష్టించడం చూసిన పిల్లలు కూడా ప్రేరణ పొందారు. తల్లిదండ్రులు సైతం పిల్లలిద్దరినీ ప్రోత్సహించారు. ఈ క్రమంలో వారి కుమార్తె జస్మిత ఒక్క నిమిషంలో ఒకే కాలితో వేగంగా అత్యధిక రోప్ స్కిప్స్ చేసి రికార్డు సృష్టించింది. అలా గిన్నిస్ బుక్‌లో చోటు సాధించింది. అక్క బాటలో తమ్ముడు ఐదేళ్ల లేత ప్రాయంలోనే మరో రికార్డు సృష్టించాడు. ట్రాంపోలిన్‌పై ఒక్క నిమిషం వ్యవధిలో అత్యధిక రోప్ స్కిప్స్ చేసి గిన్నిస్‌లో చోటు సంపాదించాడు ఐదేళ్ల శంకర్. క్రీడల విభాగంలో అతి చిన్న వయస్సులో గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు సాధించిన ఓ జపాన్ బాలుడి పేరిట 30 ఏళ్లుగా ఉన్న రికార్డును శంకర్ అధిగమించాడు.

మోదీ పిలుపు, మెగాస్టార్ ఆశీస్సులతో…

యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తేవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రోత్సహిస్తున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని స్ఫూర్తిగా తీసుకుని చైనాలో తాను యోగాతో రికార్డులు సృష్టించాలని నిర్ణయించుకున్నానని విజయ్ టీవీ9తో చెప్పారు. “ఇంటర్నేషనల్ యోగా డే” కు కారణమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల విజయ్ అమితమైన అభిమానాన్ని ప్రదర్శించారు. తాము సాధించిన గిన్నిస్ రికార్డులను జాతికి, ప్రధానికి అంకితం చేస్తున్నామని చెప్పారు. అలాగే తనను ప్రోత్సహించిన మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. విజయ్ సాధించిన గిన్నిస్ రికార్డు గురించి తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి తన నివాసానికి పిలిపించుకుని మరీ అభినందించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *