మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. ట్రిపులార్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో గేమ్ చేంజర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమా చరణ్ కెరీర్ కు కూడా చాలా కీలకం. ట్రిపులార్ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న చరణ్, ఇప్పుడు గేమ్ చేంజర్ తో అదే ఫీట్ ను రిపీట్ చేయాల్సి ఉంది.
రాంచరణ్‌కు చాలా కీలకం
ట్రిపులార్ లో చరణ్ తో పాటు నటించిన ఎన్టీఆర్, సోలో హీరోగా చేసిన దేవరతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకున్నారు. దీంతో ఇప్పుడు చరణ్ నుంచి కూడా అదే రిజల్ట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చరణ్ కూడా గేమ్ చేంజర్ తో పాన్ ఇండియా స్టార్ గా సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఆర్ సీ 16 షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరీ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు.
దర్శకుడు శంకర్‌కు కీలకం..
దర్శకుడు శంకర్ కెరీర్ కు కూడా గేమ్ చేంజర్ సక్సెస్ చాలా కీలకం. వరుస ఫెయిల్యూర్స్ తో విమర్శలు ఎదుర్కొంటున్నారు డైరెక్టర్ శంకర్. ముఖ్యంగా రీసెంట్ రిలీజ్ ఇండియన్ 2 శంకర్ ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసింది. క్లాసిక్ మూవీ ఇండియన్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఇండియన్ 2 దారుణంగా ఫెయిలయ్యింది. అంతకు ముందుకు కూడా వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లోనే ఉన్నారు శంకర్. అందుకే గేమ్ చేంజర్ తో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కష్టపడుతున్నారు శంకర్.
హీరోయిన్ కియారాకు..
హీరోయిన్ కియారాకు కూడా గేమ్ చేంజర్ సక్సెస్ ఇంపార్టెంటే. గతంలో తెలుగు సినిమాలు చేసినా పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కియారాకు రాలేదు. అందుకే గేమ్ చేంజర్ మీద గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు ఈ బ్యూటీ. శంకర్, చరణ్ కాంబో మీద ఉన్న హైప్ నేషనల్ మార్కెట్ లో తనకు హెల్ప్ అవుతుందని ఆశపడుతున్నారు. అందుకే గేమ్ చేంజర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ బ్యూటీ.
నిర్మాత దిల్ రాజుకు కీలకం..
నిర్మాత దిల్ రాజుకు కూడా గేమ్ చేంజర్ సక్సెస్ కీలకమే. గతంలో కొన్ని నేషనల్ ప్రాజెక్ట్స్ కోసం వర్క్ చేసినా… దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న అఫీషియల్, పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజరే. అందుకే ఈ సినిమాతో పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అన్న ట్యాగ్ సాధించేందుకు కష్టపడుతున్నారు. ఇప్పటికే మేకింగ్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా కోట్లు ఖర్చు పెట్టిన దిల్ రాజు, ప్రమోషన్స్ కోసం కూడా అదే స్థాయిలో బడ్జెట్ కేటాయించారు. మరి ఇంత మంది కెరీర్ ను డిసైడ్ చేయబోయే గేమ్ చేంజర్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.