EVMలపై ఇండియా కూటమిలో భిన్నాభిప్రాయాలు..! ఏకాకిగా మారుతోన్న కాంగ్రెస్..

EVMలపై ఇండియా కూటమిలో భిన్నాభిప్రాయాలు..! ఏకాకిగా మారుతోన్న కాంగ్రెస్..


ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అంటేనే ఓ భారీ కసరత్తు. అటూ ఇటుగా 100 కోట్ల జనాభా పాల్గొనే ఈ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం చూసి ప్రపంచ దేశాలే నివ్వెరపోతుంటాయి. ఇదంతా ఒకెత్తయితే.. దేశంలో జరిగే ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారీ సంబరాలు చేసుకుని తమ ఘనతగా చాటుకునే కాంగ్రెస్ పార్టీ.. ఓడినప్పుడు మాత్రం ఈవీఎం ‘గోల్‌మాల్’ అంటూ గోల చేస్తోంది. ఆ పార్టీకి ఇది కొత్తేమీ కాదు. కానీ ఈసారి కనీసం మిత్రపక్షాల నుంచి మద్ధతు లభించకపోగా.. కాంగ్రెస్ తీరును తప్పుబడుతూ మిత్రపక్షాలే తలంటేస్తున్నాయి. మొన్న జమ్ము-కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC), నిన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC)లు కాంగ్రెస్ వాదనను తప్పుబట్టాయి. దీంతో ఈవీఎం గోల్‌మాల్ ఆరోపణల విషయంలో కాంగ్రెస్ ఒంటరిగా మారింది.

బ్యాలెట్ విధానంతో సమానంగా…

ఎన్నికల ప్రక్రియలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVM) ర్యాండమైజేషన్ చేస్తారు. ఆ తర్వాత మాక్ పోల్ కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాతే ఎన్నికలు జరుపుతారు. ఇదంతా అన్ని పార్టీల ఏజెంట్ల ముందే చేస్తారు. పోలింగ్, కౌంటింగ్ సమయంలోనూ పార్టీల ఏజెంట్లు ఉంటారు. వీటన్నింటితో పాటు EVMలపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేస్తూ ‘ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్’ (VVPAT) విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఓటరు ఏ పార్టీకి ఓటు వేశారన్నది ఈవీఎం పక్కనే ఉన్న VVPATలో ఒక స్లిప్ ముద్రించి కొన్ని సెకన్ల పాటు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ స్లిప్ బాక్సులోకి జారిపోతుంది. ఓట్ల లెక్కింపు సమయంలో ర్యాండమ్‌గా కొన్ని ఈవీఎంలో వచ్చిన ఓట్లను, దానికి అనుసంధానించిన VVPAT స్లిప్పులను సరిపోల్చి చూస్తుంటారు. ఇప్పటి వరకు ఈవీఎం గణాంకాలకు, VVPATలో స్లిప్పుల లెక్కకు తేడా వచ్చిన సందర్భాలు లేవు. ఒకరకంగా చెప్పాలంటే ఇది బ్యాలెట్ విధానం కంటే కూడా మెరుగైన ఎన్నికల ప్రక్రియగా కితాబు అందుకుంది. బ్యాలెట్ విధానంలో ఓటర్లు తాము ఓటు వేయాలనుకున్న గుర్తుపై సరిగా ముద్ర వేయలేక, అనేక ఓట్లు చెల్లని ఓట్లుగా మిగిలిపోతుండేవి. EVM-VVPAT వ్యవస్థలో అలాంటి చెల్లని ఓట్లకు స్థానమే లేదు. పైగా బ్యాలెట్‌ విధానంలో బూత్ క్యాప్చరింగ్ చేసి, తమకు నచ్చిన పార్టీకి ఓట్లు గుద్దేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. లేదంటే బ్యాలెట్ బాక్సులో ఇంకు పడేసి బ్యాలెట్ పేపర్లను ముద్రించిన ఓట్లను ధ్వంసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాంటి సమస్యలు లేకుండా.. ప్రశాంతంగా జరుగుతున్న అతి పెద్ద ఎన్నికల ప్రక్రియలో అనేక రాజకీయ పార్టీలు పాల్గొంటూ.. ప్రజల ఆదరణ పొంది గెలుపొందుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఓటమికి కారణం ఈవీఎం గోల్‌మాల్ అంటూ తమ వైఫల్యాలను ఈవీఎంల మీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తోంది.

నిజానికి ఈమధ్య జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకోలేకపోయింది. కొద్ది నెలల వ్యవధిలో జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో ఓడిపోయి, రెండు రాష్ట్రాల్లో కూటమిలో భాగమై గెలుపొందింది. గెలిచిన ఆ రెండు రాష్ట్రాల్లోనూ కూటమిలో భాగమైన ప్రాంతీయ పార్టీల బలమే కాంగ్రెస్ పార్టీని గెలిపించిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జమ్ము-కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ 56 స్థానాల్లో పోటీ చేసి 42 చోట్ల గెలుపొందితే, కాంగ్రెస్ 38 స్థానాల్లో పోటీ చేసి కేవలం 6 సీట్లు మాత్రమే గెలువగలిగింది. అవి కూడా మిత్రపక్షం ఓట్లు బదిలీ కావడం వల్లనే అన్నది సుస్పష్టం. ఇక జార్ఖండ్ విషయానికొస్తే.. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) 43 స్థానాల్లో పోటీ చేసి 34 స్థానాల్లో గెలవగా.. కాంగ్రెస్ 30 స్థానాల్లో పోటీ చేసి 16 స్థానాలు గెలుచుకుంది. ఈ రాష్ట్రంలోనూ జేఎంఎంకు అనుకూలంగా ఉన్న వాతావరణమే కాంగ్రెస్ పార్టీకి ఆ కాస్త సీట్లు గెలిపించి పెట్టాయని అర్థమవుతోంది. హర్యానాలో ముఖాముఖి పోరులో బీజేపీతో తలపడగా.. స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. మహారాష్ట్రలో కూటమిలో భాగంగా పోటీ చేసినా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రజల్ని ఆకట్టుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నామన్నది గుర్తించకుండా.. ఓడిన ప్రతిసారీ ఈవీఎంలలో గోల్‌మాల్ జరిగిందని, అధికారపక్షం ఏదో మాయ చేసిందని ఆరోపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే బెంగాల్, హిమాచల్, తెలంగాణ, కర్ణాటక, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల్లో బీజేపీకి ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు గెలిచే అవకాశమే ఉండేది కాదు. గతంలో రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ గెలుపొంది ప్రభుత్వాలు నడిపింది. అప్పుడు లేని అనుమానం తాము ఓడినప్పుడు మాత్రమే లేవనెత్తడం ఆ పార్టీని మరింత పలుచన చేస్తోంది.

ఆరోపణలు కాదు, ఆధారాలు చూపండి

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఈవీఎం విధానంలో జరిగే ఎన్నికలకు మద్దతుగా మాట్లాడారు. ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తే వారు తమ వద్ద ఏవైనా ఆధారాలుంటే ఎన్నికల కమిషన్‌కు వెళ్లి డెమో చూపించాలని అన్నారు. ఈవీఎం ర్యాండమైజేషన్, మాక్ పోల్ సమయంలో అన్నీ సరిగా పనిచేసినప్పుడు ఈ ఆరోపణలో నిజం ఉందని తాను అనుకోవడం లేదని చెప్పారు. బెంగాల్‌లో వరుసగా రెండు పర్యాయాలు టీఎంసీని దెబ్బకొట్టి అధికారం సాధించాలని బీజేపీ శతవిధాలుగా ప్రయత్నించినా సరే, సాధ్యపడలేదు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ వరుసగా గెలుస్తూ వస్తోంది. కాబట్టి ఆ రాష్ట్రంలో ఈవీఎంల పనితీరుపై తృణమూల్ కాంగ్రెస్‌కు ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టమవుతోంది. అయితే తమ అభిప్రాయం వ్యక్తం చేయాలంటే ఇండి-కూటమి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించారు.

మరోవైపు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సైతం ఈవీఎంలకు మద్దతు ఇచ్చారు. ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ అంగీకరించాలని, ఈవీఎంలపై ఏడుపు ఆపాలని ఒమర్ సూచించారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎలాగైతే స్వీకరిస్తారో, ఓడినప్పుడు కూడా ఫలితాలను అలాగే స్వీకరించాలని, వాటిని నిందించడం తగదని హితవు పలికారు.

ఇప్పటికే ఇండి-కూటమి నాయకత్వం విషయంలో అభ్యంతరాలు చెబుతూ కూటమికి తమ (మమతా బెనర్జీ) నాయకత్వం అవసరమని చెబుతున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సమాజ్‌వాదీ (SP), రాష్ట్రీయ జనతా దళ్ (RJD), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) పార్టీలు సైతం మద్ధతు తెలిపాయి. ఇప్పుడు తాజాగా ఈవీఎం వాదన విషయంలో కాంగ్రెస్ తీరును తృణమూల్ తప్పుబట్టడంతో కాంగ్రెస్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *