అమరావతి, డిసెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షకు మార్గం సుగమం అయ్యింది. దేహ దారుఢ్య పరీక్ష తేదీలు కూడా ఇప్పటికే విడుదలయ్యాయి. తాజాగా ఫిజికల్ టెస్టులకు సంబంధించిన కాల్‌లెటర్లు విడుదలయ్యాయి. దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులంతా పోలీసు నియామక మండలి అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి కాల్‌లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్లో కాల్ లెటర్లు డిసెంబర్ 29 వరకు అందుబాటులో ఉంటాయి.
ఈ లోపు అభ్యర్ధులు కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని పోలీసు నియామక మండలి ఛైర్మన్ ఎం రవిప్రకాశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇక పీఎంటీ, పీఈటీ పరీక్షలు డిసెంబర్ 30 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ వరకు పలు కేంద్రాల్లో పోలీసు నియామక మండలి నిర్వహించనుంది. ఉమ్మడి జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో ఆ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలు, కాల్ లెటర్లకు సంబంధించి ఇతర ఏవైనా సందేహాలుంటే 94414 50639 లేదా 91002 03323 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని బోర్డు సూచించింది
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 నవంబరు 28న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. గతేడాది ఫిబ్రవరి 5న ప్రిలిమ్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. తదుపరి దశకు 95,209 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. అప్పటినుంచి ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా ఫిజికల్ టెస్టుల కోసం సన్నద్ధమవుతున్నారు. అయితే పలు కారణాల వల్ల దాదాపు రెండేళ్లగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ నానుతూనే ఉంది. అయితే ఈ ఏడాది అధికారం చేపట్టిన సర్కార్ కూటమి పీఎంటీ, పీఈటీ నిర్వహణ తేదీలను విడుదల చేసి, షెడ్యూల్ కూడా ఖరారు చేయడంతో కానిస్టేబుల్ పోస్టులకు మోక్షం లభించినట్లైంది. వచ్చే ఆగస్టు నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేసి, ఉద్యోగ ఉత్తర్వులు కూడా అంధిస్తామని ఏపీ హోంశాఖ స్పష్టం చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.