CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ.. పెండింగ్ నిధులు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి

CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ.. పెండింగ్ నిధులు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి


తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ గ్రాంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సహా పలు కొత్త రైల్వే లైన్ అంశాలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ‌లోని వెనుక‌బ‌డిన జిల్లాల‌కు పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం(డిసెంబర్ 13) నిర్మల సీతారామన్‌తో సమావేశమైన రేవంత్ రెడ్డి.. పలు అంశాలపై చర్చించారు. పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో తెలంగాణ‌లోని తొమ్మిది జిల్లాల‌కు ఏటా రూ.450 కోట్ల చొప్పున గ్రాంటు విడుద‌లకు అంగీక‌రించినా.. కొన్నేళ్లుగా వాటిని విడుదల చేయలేదని ఆమె దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే, రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత హైద‌రాబాద్‌లోని హైకోర్టు, రాజ్ భ‌వ‌న్‌, లోకాయుక్త, రాష్ట్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌, జ్యుడీషియ‌ల్ అకాడ‌మీ స‌హా ఇత‌ర ఉమ్మడి సంస్థల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వమే భ‌రించిందని సీఎం రేవంత్ కేంద్రమంత్రికి వివరించారు. ఆయా సంస్థల విభ‌జ‌న పూర్తయ్యే వరకు నిర్వహణకు అయిన రూ.703.43 కోట్లను ప్రభుత్వమే భరించిందని, అందులో ఏపీ వాటా రూ.408.49 కోట్లను ఇప్పించాలని కోరారు. పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని జ‌నాభా ప్రాతిప‌దిక‌న రావాలని మొత్తంలో ఏపీ నుంచి తెలంగాణ‌కు రూ.495.20 కోట్లు స‌ర్దుబాటు చేయాల్సి ఉంద‌ని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.

అనంతరం కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని ఆయనతో చర్చించారు. వికారాబాద్‌ – కృష్ణా స్టేష‌న్ మ‌ధ్య కొత్త రైలు మార్గం, క‌ల్వకుర్తి – మాచర్ల మధ్య నూత‌న రైలు మార్గం మంజూరు చేయాల‌ని కోరారు. డోర్నకల్ – మిర్యాలగూడ, డోర్నకల్- గద్వాల ప్రతిపాదిత రైలు మార్గాల‌ను పునఃప‌రిశీలించాల‌ని రైల్వేమంత్రిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *