న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఢిల్లీలోని రెండు స్కూళ్లకు ఇటీవల బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఆయా స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధులే ఈ పని చేశారని తెలిసి అవాక్కయ్యారు. అసలిలా ఎందుకు చేశారంటే..
నవంబర్ 28న రోహిణి ప్రశాంత్ విహార్ వద్ద పేలుడు సంభవించిన మరుసటి రోజే వెంకటేశ్వర్ గ్లోబల్ స్కూల్‌తోపాటు మరో స్కూల్‌కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరీక్షలు రాసేందుకు సన్నద్ధంగాలేని ఇద్దరు అన్నదమ్ములు.. పరీక్షలు వాయిదా వేసేందుకు తమ స్కూల్స్‌కి బాంబ్ బెదిరింపు ఈమెయిల్స్ పంపినట్లు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ దర్యాప్తులో తేలింది. దీంతో ఒకే స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు తమ స్కూల్‌తోపాటు మరో స్కూల్‌కి కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్ పంపినట్లు గుర్తించారు. గతంలోనూ తమ స్కూల్‌కి వచ్చిన బాంబు బెదిరింపులను దృష్టిలో ఉంచుకొని బాంబు బెదిరింపు మెయిల్ పంపినట్లు ఈ ఇద్దరు గడుగ్గాయిలు చెప్పారు. రోహిణి, పశ్చిమ్ విహార్‌లోని ఈ రెండు పాఠశాలల విద్యార్థులు స్కూళ్లు మూతపడాలనే కోరికతో నకిలీ బాంబు బెదిరింపుల ఈ-మెయిల్స్ పంపారు. దీంతో ఇద్దరూ విద్యార్ధులే కావడంతో పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
కాగా డిసెంబర్ 14,17 తేదీల్లో ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీనికి ఒక రోజు ముందు డిసెంబర్ 13న ఢీల్లీలోని మొత్తం 30 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఐపీ అడ్రస్ ట్రేస్ చేయగా ఓ విద్యార్ధి ఇంటిని గుర్తించింది. విచారించగా బాలుడు నేరాన్ని అంగీకరించాడు. పిల్లవాడికి కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు, అతడి ప్రవర్తనపై నిఘా పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు. ఇక ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం దేశ రాజధానిలోని పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని పునరావృతమయ్యే బాంబు బెదిరింపులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలపై మానసిక, విద్యాపరమైన ప్రభావాలను కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు నిరంతరం కొనసాగితే విద్యార్ధుల చదువు, శ్రేయస్సుకు భంగం కలిగిస్తాయని ఆందోళన చెందారు. ఈ క్రమంలో ఏకంగా స్కూల్ పిల్లలే బాంబు బెదిరంపులకు దిగడం విచారకరం.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.