దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని ఏపీ వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఇది డిసెంబర్ 15 నాటికి అల్పపీడనంగా మారి, ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో సోమవారం ప్రకాశం,నెల్లూరు,రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం కోస్తా,రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
భారీ వర్షం, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : హోంమంత్రి వంగలపూడి అనిత
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తిరుపతి జిల్లాలోని తిరుమల, సూళ్లూరుపేట ప్రాంతాల్లో భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఘాట్ రోడ్లలో ప్రయాణించే శ్రీవారి భక్తులు సహా వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలు,అధికారులను అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు.
ఉధృతంగా వరదనీరు ప్రవహిస్తోన్న లక్ష్మీపురం కూడలి, గొల్లవానిగుంట లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులను ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా హెచ్చరికలు పంపి అప్రమత్తం చేయాలని విపత్తు నిర్వహణ శాఖను హోంమంత్రి ఆదేశించారు. తిరుపతిలో మాల్వాడిగుండం జలపాతం ఉధృతంగా ప్రవహించడం సహా తిరుపతి జిల్లాలోని సూళ్ళూరు, కాళంగి గేట్లు ఎత్తివేత నేపథ్యంలో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..