AP News: ఎవడ్రా బాబూ.. ఇంత మోసగాడిగా ఉన్నావు.. బ్యాంకు మేనేజర్‌నే ముంచేశాడు..!

AP News: ఎవడ్రా బాబూ.. ఇంత మోసగాడిగా ఉన్నావు.. బ్యాంకు మేనేజర్‌నే ముంచేశాడు..!


ఇప్పుడు మీరు చూడబోయేది ఆన్లైన్ మోసాల్లో ఇది కొత్త రకం మోసం.. మీ బ్యాంకు వివరాలు.. ఓటిపి ఎవరు అడిగినా ఇవ్వొద్దని ఖాతాదారులను అప్రమత్తం చేసే బ్యాంక్… ఓ సైబర్ నేరగాడి వలలో చిక్కి మోసపోయింది. అనంతపురం నగరంలో ఓ బ్యాంకు మేనేజర్ ను సైబర్ నేరగాడు బోల్తా కొట్టించాడు. బ్యాంకు మేనేజర్ కు వాట్సాప్‌లో చెక్కు పంపించి… తాను హాస్పిటల్లో ఉన్నానని.. అర్జెంటుగా చెక్కు క్లియర్ చేయాలని కోరాడు.. అయితే.. ఫోన్ చేసిన వ్యక్తి సైబర్ నేరగాడా? లేక కస్టమరా? అని క్రాస్ చెక్ చేసుకోకుండానే బ్యాంకు మేనేజర్… తొమ్మిది లక్షల 50 వేల రూపాయల (9,50,000) నగదును సైబర్ నేరగాడి ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేశాడు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కొత్త రకం సైబర్ మోసం.. బ్యాంకులకే సవాల్‌గా మారింది.. అంతేకాకుండా.. బ్యాంకింగ్ రంగంలోనే సంచలనంగా నిలిచింది.

అనంతపురంలోని రాంనగర్ ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను ధన్వి హోండా షోరూం ఎండీ కవినాధ్ రెడ్డిని మాట్లాడుతున్నానని బ్యాంకు మేనేజర్ అంబరేశ్వర స్వామికి చెప్పాడు. ప్రస్తుతం తాను హాస్పటల్లో ఉన్నానని.. అర్జెంటుగా 9 లక్షల 50 వేల రూపాయల చెక్కు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని కోరాడు. బ్యాంకు మేనేజర్ అంబరేశ్వర స్వామికి వాట్సాప్ లో చెక్ ఫోటో పంపించాడు. కస్టమర్లకు బ్యాంకు పేరుతో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలని చెప్పే బ్యాంకులే సైబర్ నేరగాడి ఉచ్చులో చిక్కుకుంది. ఫోన్ చేసిన వ్యక్తి కస్టమరా? సైబర్ నేరగడ అని తెలుసుకోకుండా.. బ్యాంకు మేనేజర్ 9 లక్షల యాభై వేల రూపాయలను సైబర్ నేరగాడు చెప్పిన ఖాతాకు డబ్బు ట్రాన్స్ఫర్ చేశాడు. తమకు తెలియకుండా తొమ్మిది లక్షల 50 వేల రూపాయల నగదు వేరే ఖాతాకు ట్రాన్స్ఫర్ అవ్వడంతో అప్రమత్తమైన ధన్వి హోండా షోరూం నిర్వాహకులు బ్యాంకుకు వచ్చి.. బ్యాంకు మేనేజర్ అంబరేశ్వర స్వామికి సమాచారం ఇచ్చారు. దీంతో అసలు విషయం బయటపడింది..

ఫోన్ చేసిన వ్యక్తి ధన్వి హోండా షోరూం ఎండి కాదని.. సైబర్ నేరగాడని తెలుసుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సైబర్ నేరగాడు బ్యాంకు మేనేజర్ ను బోల్తా కొట్టించడానికి ముందే.. ధన్వి హోండా షోరూం నిర్వాహకులను బురిడీ కొట్టించాడు. బెంగళూరులోని జోమాటో ఫుడ్ డెలివరీ సంస్థ నుంచి మాట్లాడుతున్నానని.. ధన్వి హోండా షోరూమ్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫుడ్ డెలివరీ కోసం పది ద్విచక్ర వాహనాలు కావాలని..దానికి సంబంధించి ధన్వి హోండా షోరూం లెటర్ హెడ్ పై కొటేషన్ లెటర్ కావాలని సైబర్ కేటుగాడు అడిగాడు. లెటర్ హెడ్‌తో పాటు.. క్యాన్సిల్ చెక్ కూడా మెయిల్ చేయమని కోరాడు. ఒకేసారి పది బైకులు ఆర్డర్ రావడంతో.. వెనుకా ముందు ఆలోచించని షో రూమ్ నిర్వాహకులు కూడా… సైబర్ నేరగాడు ఉచ్చులో చిక్కుకున్నారు.

వెంటనే ధన్వి హోండా షోరూం లెటర్ హెడ్ తో కొటేషన్… అదేవిధంగా క్యాన్సిల్ చెక్కు సైబర్ నేరగాడికి మెయిల్ చేశారు. ఇక అసలు మోసం ఇక్కడ మొదలైంది. క్యాన్సిల్ చేసిన చెక్కు ఫోటోను మార్ఫింగ్ చేసి.. అదే చెక్కును ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ అంబరేశ్వర స్వామికి వాట్సాప్ చేశాడు.. ఈ క్రమంలో బ్యాంకు మేనేజర్ అంబరీశ్వర స్వామి కూడా వెనక ముందు ఆలోచించకుండా… ఎలాంటి క్రాస్ చెక్ చేసుకోకుండా… కేవలం వాట్సాప్‌లో వచ్చిన చెక్కును ట్రూ కాలర్ లో ధన్వి హోండా షోరూం ఎండి కవినాథ్ రెడ్డి అని వచ్చిన పేరును ఆధారంగా చేసుకుని.. అక్షరాలా తొమ్మిది లక్షల 50 వేల రూపాయల నగదును సైబర్ నేరగాడి ఖాతాకు మళ్ళించారు.

డబ్బులు చెల్లించిన బ్యాంకు మేనేజర్

షోరూం నిర్వాహకులు, బ్యాంకు మేనేజర్ అప్రమత్తమయ్యేసరికి తొమ్మిది లక్షల 50 వేల రూపాయల డబ్బు వేరువేరు ఖాతాలకు మళ్ళించాడు సైబర్ మోసగాడు.. బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యం కారణంగా అంత డబ్బు సైబర్ నేరగాడు కొట్టేయడంతో.. ధన్వి హోండా యాజమాన్యానికి, బ్యాంకు మేనేజర్ అంబరేశ్వర స్వామి తొమ్మిది లక్షల 50 వేలు రూపాయలు తిరిగి చెల్లించాడు.

ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఫోన్ చేసి బ్యాంకు వివరాలు… ఓటీపీ నెంబర్ అడగడం లాంటి విషయాలను బ్యాంకులు ఎప్పుడు చేయవు అని చెప్పే బ్యాంకే.. సైబర్ కేటుగాడి ఉచ్చులో చిక్కుకోవడం సంచలనంగా మారింది. ఇప్పటివరకు బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని కస్టమర్లను మోసం చేసే సైబర్ నేరగాళ్లు… ఇప్పుడు కొత్తగా కస్టమర్ నే మాట్లాడుతున్నానని బ్యాంకులను మోసం చేయడం మొదలుపెట్టడం ఆందోళన కలిగింది.. కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *