అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. మూడేళ్లలో నిర్మాణాలను పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. 45 పనులకు 33వేల కోట్ల నిధులు ఖర్చు చేసేందుకు సీఆర్‌డీఏకు అనుమతిచ్చింది. పోలవరం ఎడమ కాల్వ రీటెండరింగ్‌కు ఆమోదం తెలిపింది. మరోవైపు అమిత్‌షాపై విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు చంద్రబాబు.
ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ఆంధప్రదేశ్ కేబినెట్‌లో ఆసక్తికర చర్చ జరిగింది. అంబేద్కర్ విషయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్‌కు తగిన గౌరవం లభించలేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అంబేద్కర్ ఎన్నికల్లో ఓడిపోయారని చంద్రబాబు నాయుడు గుర్తించారు. మాజీ ప్రధాని వీపీ సింగ్ హయాంలో పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. అంబేద్కర్‌కు ఎవరి ద్వారా గుర్తింపు వచ్చిందనే అంశంపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
21 అంశాలపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడేళ్లలో అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. హడ్కో ద్వారా 11వేల కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతిచ్చింది. జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ ద్వారా 5వేల కోట్ల రుణానికి ఆమోదం తెలిపింది. 45 పనులకు 33వేల కోట్ల నిధులు ఖర్చు చేసేందుకు సీఆర్‌డీఏకు అనుమతిచ్చింది. పది జిల్లాల్లోని బుడమేరు వరద ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌కు ఆమోదం తెలిపింది కేబినెట్. ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్ ద్వారా వెయ్యి కోట్ల రుణానికి ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాల్వ రీటెండరింగ్‌కు అనుమతిచ్చింది., పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు ఆమోదం తెలిపింది.
క్లీన్ ఎనర్జీ కోసం ఎన్‌టీపీసీ ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. లక్షా 70 వేల కోట్ల పెట్టుబడులతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌లను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని 475 జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలని కేబినెట్ డెసిషన్ తీసుకుంది. గత ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి పార్థసారథి. 26 వేల 804 కోట్ల ప్రతిపాదనలు పంపి రూ.4వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..