ప్రకాశం, డిసెంబర్ 23: ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం వచ్చింది. దీంతో వరుసగా మూడు రోజులు మూడు సార్లు ఆ జిల్లాలో భూకంపం వచ్చినట్లైంది. సోమవారం ముండ్లమూరులో స్వల్ప భూకంపం వచ్చింది. ఒక సెకన్ పాటు భూమి కంపించటంతో భయభ్రాంతులకు గురయిన గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మూడు రోజులుగా వరుస భూప్రకంపనలు రావడంతో అసలేం జరుగుతోందో తెలియక జనాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ప్రకాశంజిల్లా దర్శి నియోజకవర్గంలో వరుసగా మూడురోజుల పాటు భూమి కంపించింది. శనివారం, ఆదివారం, సోమవారం వరుసగా మూడు రోజుల పాటు ఒకే సమయంలో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు అటూ ఇటుగా భూ ప్రకంపనాలు చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ముండ్లమూరు, శంకరాపురం, మారెళ్ళ గ్రామాల్లో భూమి కంపించినట్టు గుర్తించారు. అయితే ఈ ప్రకంపనాలు కేవలం ఒక సెకను మాత్రమే ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్థి నష్టం జరగలేదు.
నిన్న, మొన్న…
ఈనెల 21వ తేదిన శుక్రవారం ఉదయం 10. 30 గంటలకు దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు, కురిచేడు మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించింది. భూమి కంపించిన ముండ్లమూరులోని స్కూల్లో విద్యార్ధులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్ళల్లో ఉన్న ప్రజలు భూ ప్రకంపనాలను గుర్తించి రోడ్లపైకి వచ్చారు. రెండు సెకన్లపాటు స్వల్పంగా ప్రకంపనాలు వచ్చాయి. ముండ్లమూరు మండలంలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, ముండ్లమూరు గ్రామాల్లో ప్రకంపనలు గుర్తించారు. అలాగే తాళ్ళూరు మండలం గంగవరం, తాళ్లూరు, రామభద్రపురంలలో స్పల్పంగా భూమి కంపించింది. కురిచేడు, దర్శి మండలాల్లో అక్కడక్కడ భూమి కంపించినట్టు చెబుతున్నారు. అలాగే ఈనెల 22వ తేది ఆదివారం ముండ్లమూరులో ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఒక సెకను పాటు భూమి కంపించినట్టు గుర్తించారు. ముండ్లమూరుతో పాటు మారెళ్ళ, సింగన్నపాలెం గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఇవి కూడా చదవండి
ఈరోజు కూడా…
వరుసగా మూడోరోజు.. మూడోసారి కూడా ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్ళ గ్రామాల్లో ఈ రోజు ఒక సెకనుపాటు భూమి కంపించడంతో జనం ఆందోళన చెందుతున్నారు. మూడు రోజులుగా ఒకే ప్రాంతంలో భూమి కంపించడం వెనుక కారణాలను గుర్తించాలని అధికారులను కోరుతున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయో అంచనా వేయాలని, ఎలాంటి ప్రమాదం లేకుంటే ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు.
మంత్రుల ఆరా…
ప్రకాశం జిల్లాలో వరుస భూప్రకంపనలపై ఉమ్మడి ప్రకాశంజిల్లా మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, బాలవీరాంజనేయస్వామిలు ఆరా తీశారు. దర్శి నియోజకవర్గంలో భూ ప్రకంపలపై ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియాతో మంత్రులు మాట్లాడారు. తరచుగా ఈ ప్రాంతంలో భూ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో? డిజాస్టర్ మేనేజ్మెంట్ వారితో మాట్లాడి తెలుసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. అవసరమైతే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలతో కూడా చర్చించాలని కోరారు. ఈ వరుస భూ ప్రకంపనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను మంత్రులు ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.