సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన పలువురిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అధికారులు. దీనిపై ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, నేరస్థుల ప్రవర్తన, సైబర్ నేరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశంలో సోషల్ మీడియా అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈభేటీలో సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న సైకోలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్.. సీఎంను కోరారు. సోషల్ మీడియా అసభ్యకర పోస్టుల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందనీ మంత్రి నాదెండ్ల అభిప్రాయపడ్డారు. ఇది దేశానికి మార్గదర్శకంగా నిలవాలని సీఎంను కోరారు. మంత్రి విజ్ఞప్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారం తెలిపారు. అక్కడే కీలక నిర్ణయం తీసుకున్నారు.
సోషల్ మీడియా సైకోలపై చర్యలు తీసుకోవడం అత్యవసరమన్నారు సీఎం. ఈ విషయాన్ని కేవలం రాష్ట్ర పరిమితులలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అనుసరించగల మార్గదర్శక విధానాలను రూపొందించాలన్నారు. సోషల్ మీడియాలో ప్రముఖులను, ఇన్స్టిట్యూషన్లను, ఆధ్యాత్మిక సంస్థలను తప్పుగా ప్రచారం చేస్తున్న వ్యక్తులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. ముఖ్యంగా బ్రహ్మకుమారిల క్యారెక్టర్‌ను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడంపై ఆందోళన వ్యక్తం చేశారు సీఎం. సోషల్ మీడియా సైకోలకు ఫుల్ స్టాప్ పడేలా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీలను ఆదేశించారు చంద్రబాబు.
దీని కోసం ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా ఐటీ మంత్రి లోకేష్, నాదెండ్ల మనోహర్, హోంమంత్రి అనిత, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను నియమించారు. సోషల్ మీడియా వేదికగా సైకో చేష్టలు చేయకుండా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలు తీసుకుని అమలు పరచాలని సీఎం ఆదేశించారు. సోషల్ మీడియా సైకోలపై ప్రభుత్వం తీసుకునే చర్యలు దేశానికే ఆదర్శం కావాలని సీఎం సూచించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను అరికట్టి ప్రజల గౌరవాన్ని, నైతిక విలువలను కాపాడడం ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..