రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించినా పలుచోట్ల స్థానిక అధికారుల నిర్లక్ష్యం అమాయకులకు శాపంగా మారుతుంది. ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాల్లో ఆ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నాణ్యమైన వైద్యంపై అవగాహన లేక నాటు వైద్యంను ఆశ్రయిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అమాయక గిరిజనులు. నాటు వైద్యం వికటించి పార్వతీపురం మన్యం జిల్లాలో ఆరు నెలల చిన్నారి మృతిచెందిన ఘటన అందరినీ కలచివేస్తుంది. పాచిపెంట మండలం బొర్రమామిడి పంచాయతీ బొడ్డపాడులో నాటువైద్యం వికటించి ఆరు నెలల చిన్నారి మంజుకి మృతి చెందిన ఘటన విషాదంగా మారింది.
మంజుకి పుట్టిన కొద్దిరోజుల వరకు ఆరోగ్యం బాగానే ఉంది. ఆ తరువాత కొద్దిరోజులకి అనారోగ్యం బారిన పడింది. శ్వాసకోశ సమస్యతో ఆయాస పడుతూ ఉండేది. అదే గ్రామంలో ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు కూడా ఉన్నారు. అయితే మంజుకీ అనారోగ్య సమస్యను వారి దృష్టికు కూడా తీసుకెళ్లకుండా తమకు తెలిసిన వారి సలహా మేరకు మంజుకిను ఒక నాటు వైద్యుడు వద్దకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అలా వెళ్లిన వారికి నాటువైద్యంలో భాగంగా అనేక ఆకులతో కలిపి తయారుచేసిన ఒక ఆకు పసర మందు ఇచ్చాడు నాటువైద్యుడు. అలా మంజుకికి పసరు మందు ఇచ్చిన తరువాత తిరిగి ఇంటికి చేరుకున్నారు తల్లిదండ్రులు. అయితే పసరు మందు తీసుకున్న కొద్ది సేపటికే చిన్నారి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది..
తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారి తల్లిదండ్రులు తిరిగి నాటువైద్యుడుని సంప్రదించారు.. పసరు మందు ఇచ్చిన తరువాత ఆరోగ్యం కుదుటపడే ముందు జబ్బు తీవ్రంగా కనిపిస్తుందని, కానీ పసరు మందు ప్రభావంతో జబ్బు తగ్గుముఖం పడుతుందని చెప్పాడు నాటు వైద్యుడు. తల్లిదండ్రులు కూడా నాటు వైద్యుడు మాటలు నమ్మి ఆరోగ్యం విషమిస్తున్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు.
అయితే, పసరు మందు కాస్త వికటించి మరి కొంతసేపటికి తీవ్ర అనారోగ్యం పాలై చివరికి మంజుకి మృత్యువాత పడింది. మంజుకి మరణంతో ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. నాటువైద్యం వికటించి చిన్నారి మరణం స్థానికులను కలిచివేసింది. అత్యాధునిక టెక్నాలజీతో ప్రభుత్వం దూసుకుపోతుంటే క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అమాయక గిరిజనులు బలవుతున్నారు. ఇలాంటి ఘటనల పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది.. తెలిసీ తెలియని పసరు మందు వైద్యం చేసి గిరిజనుల మరణాలకు కారణమవుతున్న నాటువైద్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..