Nellore Rural Mla Kotamreddy Sridhar Reddy Came To His Office On A Bajaj Chetak Scooter
అది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం.. ఉదయం 6 గంటల నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.. సమస్యల పరిష్కారం కోసం, అలాగే తమ ప్రాంత సమస్యలు చెప్పుకునేందుకు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తరచూ ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తుంటారు. ఇప్పటిలాగే అక్కడికి వచ్చిన స్థానికులు టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కోసం వేచి చూస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తిని చూశాక అక్కడున్నా వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ కొట్టారు. విద్యార్థి సంఘం నాయకుడుగా ఏబీవీపీలో కీలకంగా పనిచేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా ప్రయత్నించారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న కోటంరెడ్డి కల నిజమైంది పోటీ చేయడమే కాకుండా విజయం సాధించారు. ఆ తర్వాత 2019, 2024 వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. స్టూడెంట్ లీడర్‌గా ఉన్న సమయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బజాజ్ చేతక్ స్కూటర్ ఉండేది. AP26 F 717 నంబరు గల చేతక్ స్కూటర్ 1987లో కొనుగోలు చేసిన కోటంరెడ్డి తర్వాత కొత్త టూవీలర్ కొనుగోలు చేసిన అనంతరం తన మిత్రుడికి బజాజ్ చేతక్ స్కూటర్‌ను బహుమతిగా ఇచ్చారు.
పాతికేళ్ల తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మిత్రుడు తనకు బహుమతిగా ఇచ్చిన స్కూటర్‌ను తిరిగి కోటంరెడ్డికి గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. బజాజ్ చేతక్ స్కూటర్‌ను చూసిన కోటంరెడ్డి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని నెల్లూరు వీధుల్లో చక్కర్లు కొట్టారు. మరుసటి రోజు ఉదయాన్నే తన కార్యాలయానికి బజాజ్ చేతక్‌పై రావడం మొదట ఎవరు పెద్దగా గమనించలేదు. ఎమ్మెల్యే వచ్చేది కారులో కదా అని స్కూటర్లో వచ్చిన వ్యక్తిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొద్దిసేపటి తర్వాత వచ్చింది ఎమ్మెల్యేనని గుర్తుపట్టిన స్థానికులు కోటంరెడ్డి అభిమానులు ఒకసారిగా షాక్ అయ్యారు. ఎమ్మెల్యేగా తనకు కారు ఉన్నప్పటికీ ఒకప్పుడు తనకు నచ్చిన ఈ స్కూటర్‌పై తిరగడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సన్నటి వీధుల్లో కారు వెళ్ళలేని ప్రాంతాల్లో ప్రజలను కలుసుకునేందుకు స్కూటర్‌పై వెళ్లడం తనకు ఇష్టమని కోటంరెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన పాత బజాజ్ చేతక్‌పై నగర వీధుల్లో చక్కర్లు కొట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో ఇదిగో:
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి