పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై ఉన్న లైంగిక వేధింపుల కేసు విచారణ లాహోర్ హైకోర్టు డిసెంబర్ 16కి వాయిదా వేసింది. ఈ కేసు పిటిషనర్ హమీజా ముఖ్తార్ గతంలో చేసిన ఆరోపణల నేపథ్యంలో కొనసాగుతోంది, ఆమె బాబర్ తనను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసి, తరువాత తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని కోర్టుకు తెలిపారు.
హమీజా తన వాదనలలో బాబర్ తనతో సంబంధాన్ని కొనసాగించిన సమయంలో గర్భవతిగా చేసిన తర్వాత బిడ్డను అబార్షన్ చేయమని ఒత్తిడి చేశాడని పేర్కొన్నారు. ఈ వాదనలకు మద్దతుగా ఆమె వైద్య పత్రాలను కోర్టులో సమర్పించారు. అంతేకాకుండా, “బ్లాక్ మెయిల్, వ్యభిచారం” ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారని ఆమె ఆరోపించారు. ఈ కేసు 2021 నుండి పెండింగ్‌లో ఉంది.
ఈ కేసులో బాబర్ తరపున హాజరుకావాల్సిన సీనియర్ న్యాయవాది బారిస్టర్ హరీస్ అజ్మత్ కోర్టుకు రాకపోవడంతో, అతని జూనియర్ న్యాయవాది విచారణను వాయిదా వేయాలని అభ్యర్థించగా, కోర్టు ఆ అభ్యర్థనను అంగీకరించింది.
ఇక బాబర్ ఆజమ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటనలో ఉన్నారు. పర్యటనలో మూడు T20Iలు, మూడు ODIలు, రెండు టెస్టులు జరుగనున్నాయి. అయితే, డర్బన్‌లో జరిగిన మొదటి T20I మ్యాచ్‌లో బాబర్ విఫలమయ్యాడు. నాలుగు బంతులు మాత్రమే ఆడిన బాబర్ డకౌట్ కాగా, పాకిస్తాన్ 11 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
ఈ పరిణామాలు బాబర్ వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన ప్రయాణంపై తీవ్ర ప్రభావాన్ని చూపించగలవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.