ధనవంతులను ట్రాప్ చేసి డబ్బు, నగలతో పరారీ అయిన ఓ బ్లాక్‌మెయిలర్ వధువును జైపూర్ పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటి వరకు ఈ యువతి గురుగ్రామ్, ఆగ్రా, జైపూర్లలో బ్లాక్ మెయిల్ చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ మాయ లేడీ పేరు సీమా అగర్వాల్ అలియాస్ నిక్కీ. ప్రస్తుతం జైపూర్ పోలీసుల అదుపులో ఉంది. బ్లాక్ మెయిల్ చేసిన వధువును విచారించిన పోలీసులు అనేక షాకింగ్ విషయాలను తెలుకున్నారు. ప్రస్తుతం ఆమెను జైలుకు పంపే చర్యలు చేపట్టారు.
ఉత్తరాఖండ్‌కు చెందిన బ్లాక్‌మెయిలర్ సీమా అగర్వాల్ ను జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ప్రముఖ మ్యాట్రిమోనియల్ సైట్ లో ప్రొఫైల్‌లను సృష్టించుకుని ధనవంతులను ఎంచుకుని పెళ్లి చేసుకుందామని సంప్రదించేది. వారి వార్షిక ఆదాయాన్ని చూసి బ్లాక్ మెయిల్ చేయడం, దోచుకోవడం ప్రారంభించింది. సీమా అగర్వాల్ పెళ్లి పేరుతో వల వేసి డబ్బులను దోచుకునే ఆట 2013 నుంచి చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె బారిన బాధితులు న్యూ ఆగ్రా, గురుగ్రామ్, జైపూర్‌కి చెందిన వారు అని గుర్తించారు. జైపూర్ నివాసి అయిన ఒక స్వర్ణకారుడు తన వార్షిక ఆదాయాన్ని కోటి కంటే ఎక్కువ అని షాదీ.కామ్‌లో తన ప్రొఫైల్ లో పేర్కొన్నాడు. అది చూసిన సీమా అగర్వాల్ అతడిని ట్రాప్ చేయాలనుకుంది. పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంది. అతడితో పెళ్లై జరిగిన తర్వాత మూడు నాలుగు నెలల పాటు ఇంట్లోనే ఉంది. తర్వాత రూ.25-30 లక్షల విలువైన నగలు, రూ.6.5 లక్షల నగదు తీసుకుని పారిపోయింది. బాధితురాలికి ఇది మూడో పెళ్లి. అంతకుముందు ఆగ్రా నివాసి వ్యాపారవేత్త, గురుగ్రామ్ నివాసి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను సీమా అగర్వాల్ అలియాస్ నిక్కీ పెళ్లి చేసుకుంది.
మూడో భర్తని ఎలా ట్రాప్ చేసిందంటే
29.07.2023న జైపూర్‌లోని జోట్వాడ నివాసి ప్రఖ్యాత నగల వ్యాపారి నిక్కీ పై కేసు పెట్టారని పోలీస్ స్టేషన్ ఆఫీసర్ మురళీపురా సునీల్ జంగిద్ తెలిపారు. తన మొదటి భార్య మరణించిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత అతను తన జీవిత భాగస్వామి కోసం ప్రముఖ మ్యాట్రిమోనియల్ సైట్ మొబైల్ అప్లికేషన్లో రిజిస్టర్ అయ్యాడు. అప్పుడు అతనికి సీమా అగర్వాల్ అలియాస్ నిక్కీతో పరిచయం ఏర్పడింది. అతను నిక్కీని కలవడానికి డెహ్రాడూన్ వెళ్ళాడు. ఇద్దరికి నచ్చిన తరువాత ఫిబ్రవరి 2023లో జైపూర్‌లోని మానసరోవర్ వివాహం చేసుకున్నారు. నాలుగు నెలల తర్వాత నిక్కీ రూ. 36.5 లక్షల విలువైన నగలు , నగదుతో ఇంటి నుండి పారిపోయింది. గతేడాది జూలైలో నగల వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి
2013లో 75 లక్షలు రికవరీ
సీమా అగర్వాల్ అలియాస్ నిక్కీ లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో ఇంటి నుంచి అదృశ్యమైంది. జైపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేయగా.. సీమా అగర్వాల్ అలియాస్ నిక్కీ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో నివసిస్తున్నట్లు తేలింది. నిక్కీ 2013లో ఆగ్రా వ్యాపారవేత్త కుమారుడిని వివాహం చేసుకుంది. కొన్ని రోజుల తరువాత.. అతని కుటుంబంపై గృహ హింస వేధింపుల కేసు పెట్టింది. అప్పుడు రాజీ పేరుతో వ్యాపార వేత్త కుటుంబం నుంచి రూ.75 లక్షలు తీసుకుంది.
గురుగ్రామ్‌లో రెండో బాధితుడు
దీని తరువాత ఈ నవ వధువు 2017 లో గురుగ్రామ్‌లో నివసిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను వివాహం చేసుకుంది. కొన్ని రోజుల తరువాత అతనిపై కేసు పెట్టింది. అతనితో విడిపోయిన తర్వాత.. సెటిల్మెంట్గా రూ.10 లక్షలు తీసుకుంది. తర్వాత మూడో సారి నగల వ్యాపారిని ఎంచుకుని పెళ్లి చేసుకుంది. తనపై నమ్మకం ఏర్పడిన తర్వాత ఇంట్లోని విలువైన నగలు, వస్తువులను దొంగిలించి పారిపోయింది. కుట్రలో భాగంగా.. ఆమె డెహ్రాడూన్‌కు వెళ్లి మూడో భర్తపై, అతని కుటుంబం పై కూడా అసహజ శృంగారం, అత్యాచారం కేసు నమోదు చేసింది.
ఉత్తరాఖండ్ లో నిక్కీ అరెస్టు
జైపూర్‌లోని మురళీపురా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ సునీల్ జంగీద్ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ లో ఆమెను అరెస్టు చేసిన తర్వాత, సీమా అలియాస్ నిక్కీని విచారించగా.. అగర్వాల్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులే ఆమె టార్గెట్ అని తెలిసినట్లు.. అది కూడా భార్యని పోగొట్టుకున్న వారు లేదా విడాకులు తీసుకున్న వ్యాపారవేత్తల కోసం వల వేస్తున్నట్లు తెలుసుకున్నారు. తాను ఎంచుకున్న వ్యక్తి గురించి పూర్తి సమాచారం సేకరించి అంటే వ్యాపారం, ఆస్తులు, డబ్బులు ఇలా అన్ని వివరాలను సేకరించిన తర్వాత పెళ్లి పేరుతో మోసం చేయడానికి పక్కా ప్రణాళిక రెడీ చేసుకునేది అని చెప్పారు. పెళ్లి చేసుకుని మూడు నాలుగు నెలలు అతని ఫ్యామిలీ నమ్మకం గెలుచుకుని తర్వాత డబ్బులు, నగలు తీసుకుని పారిపోతుంది ఈ నిత్య పెళ్లి కూతురు. ఈమెకు సంబంధించి ప్రస్తుతం సీమకు మూడు పెళ్ళిళ్ళు వెలుగులోకి వచ్చినా ఇంకా ఆ యువతి ఫేక్ పెళ్ళిళ్ళు చేసుకుందని.. త్వరలో అవి కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..