హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలోని భరత్ నగర్‌లో ఇటీవల కాలంలో చెప్పులు, షూలు మాయమవుతున్న ఘటనలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. అయితే, చెప్పులు, షూలు మాయమవ్వడం సాధారణ దొంగతనంగా భావించిన స్థానికులు.. కొంతకాలానికి దీని వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుసుకున్నారు. చెప్పులు, షూలు, స్లిప్పర్లను చోరీ చేస్తూ.. అవి విక్రయించడానికి ఓ దంపతులు వినూత్న పద్ధతిని ఉపయోగించారు. వారి ఇంటిని చెప్పుల గోడౌన్‌గా మార్చి, భారీగా దొంగతనాలకు పాల్పడుతూ స్థానికులను భయాందోళనకు గురిచేశారు.
బుధవారం, స్థానిక వ్యక్తి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తిని గుర్తించి అతనిని అనుసరించాడు. ఇంకొంత మంది స్థానికులు కూడా అతనితో చేరి పరిశీలన చేయగా, అతడు అనేక చోరీ కేసులకు పాల్పడినట్లు స్పష్టమైంది. దంపతుల ఇంటిని పరిశీలించిన స్థానికులు దాంతో ఆశ్చర్యానికి గురయ్యారు. చోరీ చేసిన షూస్, చెప్పులను బ్యాగుల్లో, అలమారాల్లో, కప్పు మీదపైన కూడా పూడ్చి పెట్టినట్లు గుర్తించారు. దాదాపు 100 జతల వరకు దొంగతనానికి గురైన షూస్, స్లిప్పర్లు వారి ఇంట్లో కనిపించాయి.
చోరీకి గురైన కొన్ని చెప్పులను స్థానికులు తమవిగా గుర్తించారు. దీన్ని ప్రామాణికంగా తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.చోరీకి సంబంధించిన చర్యలను సీసీటీవీ కెమెరాల్లో రికార్డు చేశారు. దానిలో ఉన్న ఆధారాలతో పాటు స్థానికుల సహకారం వల్ల దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దంపతులు దొంగతనాలు చేసి, ఆ చెప్పులను వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిసింది.
వీడియో చూడండి..
నిందితులు వాసవీ నగర్‌కు చెందిన తళారి మల్లేశ్, అతని భార్య రేణుక గా గుర్తించారు.. ఇటీవల రేణుక మద్యం మత్తులో స్టేషన్‌కు వచ్చి హల్చల్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. చెప్పులు, షూల దొంగతనం అనంతరం.. వాటిని ఎర్రగడ్డ మార్కెట్లో రూ.100, రూ.200కు అమ్ముతున్నట్లు నిందితులు తెలిపారు.. నిందితులు నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు ఈ కేసును విజయవంతంగా ఛేదించడంతో స్థానికులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం వారు మరిన్ని చోరీలకు పాల్పడ్డారా లేదా అనేది దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.