కర్నూల్, డిసెంబర్ 23: మారెమ్మ దేవరలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఒకేఒక్క పొట్టేలు ధర ఏకంగా రూ.1.36 లక్షలు పలికింది. అవును ఇది నిజమే.. ఎద్దులు, పాడి పశువులు పలకని ధర పొట్టేలు పలకడంతో చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో ఈ మేరకు రికార్డ్ స్థాయిలో పొట్టేలు ధర పలికింది. దీంతో సదరు పొట్టేలును చూసేందుకు భారీగా జనాలు తరలి వస్తున్నారు. స్థానికంగా నివాసం ఉండే చింతలగేని నరసారెడ్డి అనే వ్యక్తి లక్ష ముప్పై ఆరువేల రూపాయలకు ఈ పొట్టేలును కొనుగోలు చేశాడు.
కోసిగిలోని కడాపాలెం నాల్గవ వార్డులోని ముసలి మారెమ్మ దేవి దేవర కోసం.. టీడీపీ టౌన్ అధ్యక్షులు చింతలగేని నర్సారెడ్డి పొట్టేలు కొనుగోలు చేశాడు. కర్ణాటక రాష్ట్రం బాగాలకోట్ జిల్లా, అమ్మిన గడ్డ సంతలో రికార్డు ధరకు రూ.లక్ష ముప్పైఆరు వేలకు పొట్టేలను కొనుగోలు చేశాడు. దీంతో కోసిగిలో ఈ పొట్టేలు ధర హాట్ టాపిక్‌గా మారింది. సదరు పొట్టేలును చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు, వివిధ గ్రామాల రైతులు క్యూ కట్టారు.
కోసిగిలో 5 ఏళ్ల తర్వాత మారెమ్మ దేవి దేవర ఉత్సవాలు జరుగుతుండడంతో అక్కడ పొట్టేళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో అత్యధిక రేట్లకు పొట్టేలను కొనుగోలు చేస్తున్నారు. అందులో భాగంగానే కోసిగి టీడీపీ టౌన్ అధ్యక్షులు చింతలగేని నర్సారెడ్డి లక్ష ముప్పై ఆరు వేలకు పొట్టేలను కొనుగోలు చేసి రికార్డు సృష్టించాడు. లక్ష రూపాయల పైబడి ఉన్న పొట్టేలను కొనుగోలు చేయడం ఇది మూడో సారి. ఈ పొట్టేలుతో దేవర చేస్తున్నానని, ఎద్దులకు గానీ, బర్రెలకు గానీ లక్ష రూపాయలు లేవని నర్సరెడ్డి తెలిపారు. ఈ పొట్టేలు వయసు నాలుగు సంవత్సరాలు.. దీని బరువు దాదాపుగా 140 కేజీలు ఉందని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.