Loan Apps: ఇక లోన్ యాప్స్ ఆటలు సాగవు.. రూ.కోటి వరకు ఫైన్, 10 ఏళ్లు జైలు

Loan Apps: ఇక లోన్ యాప్స్ ఆటలు సాగవు.. రూ.కోటి వరకు ఫైన్, 10 ఏళ్లు జైలు


అనియంత్రిత రుణాలు (అన్‌రెగ్యులేటెడ్ లోన్లు)పై కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. లోన్​ యాప్​లకు చెక్​ పెట్టే  పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ముసాయిదా బిల్లును రూపొందించింది. నిబంధనల్ని అతిక్రమించిన వారికి పెద్ద మొత్తంలో జరిమానాతో పాటు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా మార్గదర్శకాలు రూపొందించింది. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఇష్టారీతిన రుణ సదుపాయం కల్పించే సంస్థలకు అడ్డుకట్ట వేయనుంది. ఈ మేరకు అవలంబించాల్సిన విధివిధానాలపై ఒక నివేదికను ఇప్పటికే ఆర్బీఐ సమర్పించింది. 2021 నవంబర్‌లో ఆర్బీఐ ‘వర్కింగ్ గ్రూప్ ఆన్ డిజిటల్ లెండింగ్’ అనే రిపోర్ట్​ను సమర్పించింది. దీని ప్రకారం తాజా ముసాయిదా బిల్లులోని ప్రతిపాదనలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చట్ట ఉల్లంఘనే..

ఆర్బీఐ లేదా ఇతర నియంత్రణ సంస్థల అనుమతి లేకుండా లోన్లు ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థలపై నిషేధం విధించాలి. రుణాల్ని డిజిటల్ లేదా ఏ రూపంలో అందిస్తున్నా చట్టాల పరిధిలోకి రాని పక్షంలో అది ఉల్లంఘన కిందికి వస్తుంది.

భారీ పెనాల్టీ, జైలు

కేంద్రం తీసుకొచ్చే నిబంధనల్ని ఎవరైనా ఉల్లంఘిస్తే కనీసం రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలుతో పాటు రూ. 2 లక్షల నుంచి గరిష్టంగా రూ. కోటి వరకు జరిమానా ఉంటుంది. చట్టవ్యతిరేక పద్ధతుల్లో రుణాలను ఇచ్చి, వినియోగదారుల్ని వేధించే వారికి, రికవరీ చేసే వారికి కనీసం మూడేళ్ల నుంచి పదేళ్ల పాటు జైలు సహా జరిమానా ఉంటుంది.

సీబీఐ దర్యాప్తు కూడా..

ఎవరైనా లోన్లు ఇచ్చేవారు, తీసుకునేవారు, వారి ఆస్తులు వేర్వేరు రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నా, లేదా ప్రజా ప్రయోజనాల్ని దెబ్బతీసే స్థాయిలో ఎక్కువ మొత్తం రుణాలు ఇచ్చినా అప్పుడు ఆ కేసుకు సంబంధించి దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయొచ్చు.

ఆత్మహత్యలు పెరగడంతో కేంద్రం చర్యలు

సరైన ధ్రువీకరణ లేని చాలా లోన్​ యాప్స్ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు మోసపోతున్నారు. ఇలా లోన్ ఇచ్చి తిరిగి వసూలు కోసం చేపడుతున్న చట్ట వ్యతిరేక పద్ధతులతో పాటు వేధింపుల వల్ల ఆత్మహత్యలు కూడా పెరిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో 2022-23 మధ్య దాదాపు 2 వేలకుపైగా మోసపూరిత లోన్ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి గూగుల్​ తొలగించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్త ప్రతిపాదనలతో కేంద్రం బిల్లును తీసుకొస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *