Lifestyle: ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌

Lifestyle: ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌


చలికాలం వచ్చే ప్రధాన సమస్యల్లో జలుబు, దగ్గు ఒకటి. వీటి కారణంగా ఛాతిలో కఫం పేరుకుపోతుంది. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దీంతో చాలా మంది వైద్యుల సూచనలు పాటిస్తూ రకరకాల మందులను వాడుతుంటారు. అయితే ఇంట్లోనే వంటింటి చిట్కలతో ఈ కఫం సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. కఫం మొదలు గొంతునొప్పి వరకు సమస్యలకు ఉపశమనం కలిపించే ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నిమ్మకాయ, మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు దూరమవుతాయి. నిమ్మకాయలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. నిమ్మరసంలో మిరియాలపొడిని వేసుకొని తీసుకోవడం వల్ల కఫం సమస్య దూరమవడే కాకుండా గొంతు క్లియర్‌ అవుతుంది. ఒక కప్పు వేడి నీటిలో టీస్పూన్ నిమ్మరసం, చిటికెడు నల్ల మిరియాలను కలుపుకుని తీసుకోవాలి.

పసుపుపాలు కూడా శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. పసుపులో కర్కుమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తాయి. రోగనిరోధక శక్తి పెరిగి.. శరీరానికి విశ్రాంతి లభించి మంచి నిద్ర లభిస్తుంది. ఒక గ్లాసు వేడి పాలలో అర టీస్పూన్ పసుపు కలుపుకుని తీసుకుంటే శ్వాస సమస్యలకు దూరమవుతాయి.

తులసి, లవంగంతో టీ చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. రోజూ ఉదయాన్నే పడగడుపున రోజూ ఈ డ్రింక్‌ తీసుకుంటే గొంతు నొప్పిని తగ్గించడంతో పాటు, కఫం తగ్గి శ్వాస తీసుకోవడంలో ఉపశమనం లభిస్తుంది. ఇన్ఫెక్షన్‌ నుంచి శరీరాన్ని రక్షించడంతో పాటు వాపును కూడా తగ్గిస్తుంది. కప్పు నీటిలో కొన్ని తులసి ఆకులు తీసుకొని అందులో 2 లవంగాలు వేసి మరగించాలి. అనంతరం వడకట్టి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

అల్లం రసం కూడా శ్వాస సంబంధిత సమస్యలు దూరమవుతాయి. అల్లం రసంలో తేనె కలుపుకుని తీసుకుంటే దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో మిరియాల పొడిని కలిపి తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఇక ఛాతిలో కఫం సమస్యకు చెక్‌ పెట్టడంలో ఆవిరి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పసుపు లేదా పుదీనా ఆకులను వేడి నీటిలో వేసుకొని ఆవిరి పట్టుకుంటే కఫం సమస్య దూరమవుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *