జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దీనిపై చర్చ కొనసాగుతుండగా.. బిల్లు కోసం బీజేపీ, కాంగ్రెస్ సహా చాలా పార్టీలు విప్ జారీ చేయడం తెలిసిందే. అటు ఈ బిల్లును కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీల ఎంపీలు సభలో మాట్లాడుతున్నారు.
ఒకే దేశం – ఒకే ఎన్నిక నినాదాన్ని కొన్నేళ్లుగా వినిపిస్తున్న మోదీ సర్కార్, ఇందుకోసం కార్యాచరణ మొదలుపెట్టింది. రామ్‌నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటుచేయడం, ఆ కమిటీ నివేదిక ఇవ్వడం జరిగిపోయాయి. ఈ ప్రతిపాదన ఇప్పుడు బిల్లు రూపంలో దిగువసభకు వచ్చింది. ఈ బిల్లు పాస్ కావడం కోసం మోదీ ప్రభుత్వం విపక్షాల మద్దతును కూడగట్టే ప్రయత్నంలో ఉంది. ఇందుకోసం JPCని ప్రకటించే అవకాశం ఉంది. జమిలి బిల్లును JPC పరిశీలించడానికి తొలుత 90 రోజుల సమయం ఇస్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి, కాలవ్యవధిని పొడిగించే అవకాశం ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసమే జమిలి ఎన్నికలంటోంది బీజేపీ. అయితే ఏపీ, ఒడిశా లాంటి రాష్ట్రాల్లోని ప్రభుత్వాల గడువు 2029 వరకు ఉంటుంది. మరి.. రెండేళ్ల పరిపాలన రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్తాయా అన్నది అసలు ప్రశ్న.
అసలు జమిలి ఎన్నికల బిల్లు ఎందుకు.?
జమిలి బిల్లును ప్రవేశపెట్టడం వరకు ఓకే.. కానీ, ఆమోదం పొందడం మాత్రం అంత ఈజీ కానేకాదు. ఎందుకంటే, జమిలి బిల్లు ఆమోదం పొందాలంటే.. రాజ్యాంగ సవరణలు తప్పనిసరి. అందుకు, పార్లమెంట్‌లో సాధారణ మెజారిటీ సరిపోదు. మూడింట రెండో వంతు ఎంపీల మద్దతు అవసరం. అంటే, పార్లమెంట్‌లో 67శాతం సపోర్ట్ కావాలి.. లోక్‌సభలో 362మంది ఎంపీలు, రాజ్యసభలో 164మంది సభ్యులు మద్దతు దొరికితే బిల్లు గట్టెక్కుతుంది. ప్రస్తుతమున్న బలాబలాల ప్రకారం అధికారపక్షం ఎన్డీఏకి మూడింట రెండొంతుల బలం కనిపించడం లేదు. లోక్‌సభలో 543మంది ఎంపీలు ఉంటే.. అధికారపక్షం ఎన్డీఏకి 293మంది.. విపక్ష ఇండియా కూటమికి 235మంది ఎంపీలు ఉన్నారు. ఈ లెక్కన చూస్తే.. లోక్‌సభలో జమిలి బిల్లు ఆమోదం పొందడం కష్టమే. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా ఎన్డీఏకి మూడింట రెండొంతుల బలం లేదు. రాజ్యసభలో మొత్తం 245మంది సభ్యులు ఉంటే.. అధికారపక్షం ఎన్డీఏకి 125మంది.. విపక్ష ఇండియా కూటమికి 88మంది ఎంపీలు ఉన్నారు. ఈ లెక్కన చూస్తే.. రాజ్యసభలోనూ జమిలి బిల్లు ఆమోదం పొందడం కష్టమే.
జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలు తప్పనిసరి. ముఖ్యంగా పార్లమెంట్ కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83, ఆర్టికల్ 83(2).. ఈ రెండింటినీ సవరణలు చేయాల్సి ఉంటుంది. అలాగే, అసెంబ్లీలకు సంబంధించిన ఆర్టికల్ 172(1) మరియు (2B), ఆర్టికల్ 356లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 85 (2B), ఆర్టికల్ 327, ఆర్టికల్ 324, ఆర్టికల్ 324(A), ఆర్టికల్ 325.. వీటికి కూడా సవరణలు తప్పనిసరి.
జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే లాజిస్టిక్స్ సమస్య అడ్డంకిగా మారుతుందన్నది విశ్లేషకుల వాదన. ఈవీఎం యంత్రాలతో పాటు వందశాతం వీవీప్యాట్స్ అందుబాటులో ఉంచడం అనేది పెద్ద సమస్యని అంటున్నారు. ఎన్నికల సామగ్రిని భద్రపరుచడానికి తగినన్ని గోడౌన్ల కూడా సమస్యగా మారింది. 15 ఏళ్లకోసారి ఈవీఎంలను మార్చాల్సి ఉంది. ఈవీఎంలలో 40% వరకు డెడ్‌లైన్ దాటినవేనని నిపుణులు చెబుతున్నారు. 2009 లోక్‌సభ ఎన్నికలకు వెయ్యి 115 కోట్లు, 2014లో 3వేల 870 కోట్లు ఖర్చు అయితే.. 2019లో ఈ ఖర్చు పది వేల కోట్ల రూపాయలకు పెరిగినట్లు అంచనా. ఇక శాసనసభ ఎన్నికల నిర్వహణను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రానికి రూ. 250 కోట్లు ఖర్చవుతుందనుకుంటే, మొత్తం 28 రాష్ర్టాల అసెంబ్లీలకు, లోక్‌సభ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు కలిపి అయ్యే ఖర్చు పెద్దమొత్తంలో ఉండబోతోంది.
జమిలితో లాభాలు చూస్తే.. తరచూ వచ్చే ఎన్నికల కోడ్ వంటి అడ్డంకులు తప్పడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వాలు దృష్టిసారించవచ్చు. ఎన్నికల వ్యయం, సిబ్బంది వినియోగం, నిర్వహణ భారం తగ్గుతుంది. ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఒకేసారి ఎన్నికల నిర్వహణతో ఓటు వేయడానికి ప్రజలు తరుచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఉత్పాదకత పెరుగుతుంది. జమిలితో నష్టాలు కూడా ఉన్నాయి. భారత్ లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఒకేసారి ఎన్నికలు కష్టం. పారదర్శకతపై అనుమానాలు కలుగొచ్చు. జమిలిపై రాజ్యాంగంలో ప్రస్తావన లేదు కాబట్టి, ఇప్పటికైతే ఇది రాజ్యాంగ విరుద్ధం. గడువులోపే ప్రభుత్వాలు పడిపోతే జమిలి లక్ష్యమే దెబ్బతింటుంది. అవిశ్వాసం ఎదుర్కొనే ప్రభుత్వాల విషయంలోనూ ఇది జరుగొచ్చు. జమిలితో జాతీయ పార్టీలకు మేలు జరుగొచ్చు. జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీకి కూడా ప్రజలు ఓటేస్తే, ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదం ఉంది. జమిలి నిర్వహణకు భారీగా సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరం.
జమిలి బిల్లుకు ఏ పార్టీ మద్దతిస్తోంది.. ఏ పార్టీ వ్యతిరేకిస్తోందో..
ఎన్డీఏలోని పార్టీలన్నీ జమిలికి జైకొడుతున్నాయ్. ఎన్టీఏ కూటమిలోని ప్రధాన పక్షమైన బీజేపీతోపాటు టీడీపీ, జేడీయూ, షిండే-శివసేన, అజిత్‌పవార్-NCP, జేడీఎస్, జనసేన, లోక్‌జన్‌శక్తి, రాష్ట్రీయ లోక్‌దళ్, పట్టల్ మక్కల్ కట్చి, ఏజీపీ, సోనేలాల్ అప్నాదళ్, నేషనల్ పీపుల్స్ పార్టీ.. జమిలికి ఓకే అంటున్నాయి. కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఆర్జేడీ, టీఎంసీ, బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం.. జమిలికి నో చెబుతున్నాయ్.
జమిలి బిల్లు ఆమోదం పొందితే..
ఒకవేళ జమిలి బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభ నుంచి పంచాయతీల వరకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయ్. అంటే.. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయ్. అలాగే, స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. నిజానికి ఇదే కొత్త కాదు. 1952 , 1967లో లోక్‌సభ , అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించిన చరిత్ర వుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..