భూమివైపు భారీ గ్రహశకలం దూసుకొస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) హెచ్చరించింది. విమానం సైజులో ఉండే ఈ గ్రహశకలం క్రిస్మస్ ముందు రోజు డిసెంబర్ 24న భూమికి అత్యంత సమీపం నుంచి వెళ్లనుంది. దీనితో పాటు మరో నాలుగు ఆస్టరాయిడ్స్ కూడా భూమికి అతి సమీపం నుంచి వెళ్లనున్నాయి. ఇందులో 2024 XN1 ఆస్టరాయిడ్ 120 అడుగుల పరిణామంలో విమానం సైజులో ఉంటుందని నాసా వెల్లడించింది. ఇప్పటివరకు నాసా గుర్తించిన అతిపెద్ద గ్రహశకలాల్లో ఇది అతిపెద్దది అని పేర్కొంది. ఈ గ్రహ శకలం భూమికి 72.17 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి గంటకు సుమారు 24 వేల కిలోమీటర్ల వేగంతో వెళ్లనుంది.
డిసెంబర్ 19 నుంచి..
అయితే, దీనికి ముందు ఇతర చిన్న గ్రహశకలాలు సైతం భూమికి సమీపంలోకి రానున్నాయి. డిసెంబర్ 19న 49 అడుగుల ఆస్టరాయిడ్ (2024 YA) 8.69 మైళ్ల దూరం నుంచి దూసుకుపోనుంది. 44 అడుగుల పొడవున్న మరో గ్రహశకలం (2024 XY4) డిసెంబర్ 20న 30 లక్షల మైళ్ల దూరం నుంచి పోనుంది. డిసెంబర్ 21న రెండు గ్రహశకలాలు 2024 XQ4 (50 అడుగులు), 2024×20 (60 అడుగులు) 6.56 లక్షల మైళ్ల దూరం నుంచి వెళతాయి.
ఈ గ్రహ శకలాలు భూమిపై ఏ ప్రాంతంలో పడుతాయి? ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. ఈ విషయంలో చాలా మందిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం ప్రమాదమేమీ లేదు
భూమి నుంచి 46 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న వస్తువులను నాసా నిరంతరం పరిశీలిస్తుంది. ఈ దూరంలో ఉన్న 150 మీటర్ల కన్నా ఎక్కువ పరిణామంలో ఉండే వస్తువులను భూమికి ప్రమాదకరమైనవిగా భావిస్తారు. నాసా వీటికి సంబంధించిన సైజు, దూరం, భూమికి సమీపించే తేదీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఆ సమాచారాన్ని వెల్లడిస్తుంది. ప్రస్తుతం నాసా గుర్తించిన గ్రహశకలాలతో భూమికి ఎలాంటి ముప్పు లేదని పేర్కొంది.