కోల్‌కతాలో దారుణం వెలుగు చూసింది. తనతో శృంగారానికి నిరాకరించినందుకు సొంత మరిది వదినను అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఆమె తల నరికి, ఆమె శరీరాన్ని మూడు ముక్కలుగా చేశాడు. ఆపై శరీర భాగాలను దక్షిణ కోల్‌కతాలోని నాగరికమైన టోలీగంజ్ పరిసరాల్లోని చెత్త కుండీలో పడేశాడు. ఈ ఘటనకు సంబంధించి కోల్‌కతా పోలీసులు నిందితుడు అతియుర్ రెహ్మాన్ లస్కర్‌ను దక్షిణ 24 పరగణాల డైమండ్ హార్బర్‌లోని బసుల్దంగా గ్రామంలో అరెస్టు చేశారు. రెండేళ్లుగా భర్తతో విడివిడిగా ఉంటున్న మహిళను హత్య చేసినట్లు లస్కర్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
శుక్రవారం(డిసెంబర్ 13) నాడు గ్రహం రోడ్‌కు సమీపంలోని చెత్త కుప్పలో మహిళ తల కనిపించింది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆమె మొండెం, దిగువ శరీరం శనివారం రీజెంట్ పార్క్ ప్రాంతంలోని చెరువు వద్ద గుర్తించారు. సౌత్ సబర్బన్ డీసీపీ బిడిషా కలిత ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న 35 ఏళ్ల మరిది అతిఉర్ రెహమాన్ లస్కర్ నేరాన్ని అంగీకరించాడు. అదే ప్రాంతంలో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న మహిళ తన ప్రేమను పదే పదే తిరస్కరించడంతో హత్య చేశాడని డీసీపీ వెల్లడించారు.
బాధితురాలు రీజెంట్ పార్క్‌లో ఇంటి పనిమనిషిగా చేస్తుంది. టోలీగంజ్‌లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న లస్కర్‌తో కలిసి రోజూ పనికి వెళ్లేది. ఆమె మరిది అయిన లస్కర్ తనతో సంబంధం పెట్టుకోవాలని నిత్యం వేధిస్తున్నాడు. అయితే ఆమె అతనిని తిరస్కరించిందని డీసీపీ తెలిపారు. దీంతో లస్కర్‌కు కోపం వచ్చింది. అతన్ని దూరం పెడుతూ వచ్చిన మహిళ, అతని ఫోన్ నంబర్‌ను కూడా బ్లాక్ చేసింది. అయితే, గురువారం(డిసెంబర్ 12) సాయంత్రం ఆమె పని ముగియగానే.. నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లాల్సిందిగా బలవంతం చేశాడు. అక్కడ ఆమెను గొంతు నులిమి చంపి, ఆపై తల నరికేశాడు లస్కర్. మృతదేహాన్ని మూడు భాగాలుగా నరికి దూరంగా విసిరేశాడు.
ఈ కేసులో మరికొందరి ప్రమేయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతంలో తెగిపడిన తల కనిపించడంతో అక్కడి ప్రజల్లో భయందోళనలు నెలకొన్నాయి. శుక్రవారం ఉదయం గోల్ఫ్ గ్రీన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రాహం రోడ్డులో ప్లాస్టిక్ సంచిలో తెగిపడిన తలను స్థానికులు చూశారు. తెగిపడిన తల కనిపించడంతో సంఘటనా స్థలంలో స్నిఫర్ డాగ్‌లతో పోలీసులు మోహరించారు.సమీప ప్రాంతాల CCTV ఫుటేజీని సమీక్షించారు. దీంతో 24 గంటల్లోపే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..