థానె, డిసెంబర్ 13: రోజూ ఉదయాన్నే భార్య మార్నింగ్ వాకింగ్‌కు ఒంటరిగా వెళ్తుందని ఆమె భర్త ‘ట్రిపుల్ తలాక్’ చెప్పేశాడు. నీకూ నాకు ఇకపై ఎలాంటి సంబంధం లేదు.. నీకు విడాకులిచ్చేస్తున్నానంటూ తెగేసి చెప్పాడు. దీంతో షాకైన భార్య పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు సదరు పతి దేవుడిని వెతికి పట్టుకుని కటకటాల వెనుకవేశారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ముంబ్రా ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల వ్యక్తి గత మంగళవారం తన భార్య (25) తండ్రికి ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ ద్వారా తన వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఇంత హఠాత్తుగా ఎందుకు ఇస్తున్నావ్? నా కూతురు ఏం తప్పు చేసిందని? పిల్లనిచ్చిన మామ అడగ్గా.. అల్లుడు చెప్పిన సమాధానం విని దాదాపు ముర్చపోయినంత పనైంది. తన భార్య రోజూ ఒంటరిగా వాకింగ్‌కు వెళుతోందని, అందుకే ఆమెకు విడాకులు ఇస్తున్నట్లు ఫోన్ చెప్పాడు. అనుమానపు భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిజానికి 2019లోనే ‘ట్రిపుల్ తలాక్’ (తక్షణ విడాకులు) చట్టంపై నిషేధం విధించారు. అయినా ఇలాంటి సంఘటనలు నిత్యం దేశంలో ఏదో ఒక చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఘటనలో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఓ అధికారి శుక్రవారం మీడియాకు తెలిపారు. భార్యపై నేరపూరిత బెదిరింపు, ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం కింద భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 351(4) కింద బుధవారం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందని అధికారి తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.