గూర్ఖా.. ఈ పేరు చెప్పగానే రాత్రుళ్లు చేతిలో కర్ర పట్టుకుని గస్తీ కాచేవారే గుర్తుకొస్తారు. కానీ గూర్ఖాలంటే కేవలం నైట్ వాచ్‌మన్లు మాత్రమే కాదు..! విరోచిత పోరాట పటిమ, యుద్ధ నైపుణ్యాలు కల్గిన ప్రత్యేక హిమాలయ జాతి. అందుకే గూర్ఖాల కోసమే ప్రత్యేక సైనిక బలగాలు ఏర్పాటయ్యాయి. హిమాలయ ప్రాంతాల్లో ముఖ్యంగా ‘నేపాల్’ దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉండే గూర్ఖాలు భారత సైన్యంలో గణనీయమైన సంఖ్యలో ఉన్నారు.
దేశం వేరైనా.. భారతదేశం కోసం ఎన్నో యుద్ధాలు చేశారు. ప్రాణత్యాగాలు సైతం చేశారు. అలాంటి గూర్ఖాలు గత కొన్నేళ్లుగా భారత సైన్యంలో చేరడం లేదు. అసలు పొరుగు దేశ పౌరులు భారత సైన్యంలో చేరడమేంటి? అన్న సందేహం కలగవచ్చు. కానీ దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు బ్రిటీష్ పాలనలో ఉన్న సమయం నుంచే గూర్ఖాల కోసం ప్రత్యేక రెజిమెంట్లు ఏర్పడ్డాయి. స్వాతంత్ర్యం అనంతరం ఆ రెజిమెంట్లను భారత సైన్యానికి అప్పగిస్తూ.. భారత్, నేపాల్, బ్రిటన్ దేశాల మధ్య ఒక త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. దాని ప్రకారమే భారత సైన్యంలోని గూర్ఖా రెజిమెంట్లలో నేపాల్‌లో పుట్టి పెరిగిన గూర్ఖా యువత నియమితులవుతూ వచ్చారు. తమ దేశ సైన్యం కంటే భారత సైన్యంలో చేరడానికే ఆసక్తి చూపుతూ వచ్చారు.
గూర్ఖాలు ప్రదర్శించే యుద్ధ నైపుణ్యాలు, సైనిక సత్తా, ధైర్య సాహసాలు, తెగువతో పాటు వీర విధేయత, విధి నిర్వహణ పట్ల అంకితభావం.. ప్రపంచవ్యాప్తంగా వారికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. అందుకే గూర్ఖాలతోనే ప్రత్యేక బ్రిగేడ్లు, రెజిమెంట్లు ఏర్పడ్డాయి. దీనికి 2 శతాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ ఘనమైన చరిత్ర కొంత ప్రశ్నార్థకంగా మారింది. అందుకు భారత రక్షణశాఖ తీసుకున్న ఒక నిర్ణయం కారణమైంది. గత నాలుగేళ్లుగా భారత సైన్యంలో గూర్ఖాలు చేరడం లేదు. కొత్తగా తీసుకొచ్చిన ‘అగ్నివీర్’ పథకం గూర్ఖాల నియమాకంపై ప్రతికూల ప్రభావం చూపింది. అదేంటో వివరంగా తెలుసుకునే ముందు ఈ గూర్ఖాల చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
గూర్ఖాలు – పోరాట యోధులు
ప్రపంచవ్యాప్తంగా పోరాట యోధులుగా, విరోచిత తెగువ, ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ సైనికులుగా ఖ్యాతి గడించిన తెగలు, సమూహాల్లో నేపాలీ గూర్ఖాలు ముందు వరుసలో నిలుస్తారు. స్కాట్లాండ్‌లోని హైల్యాండర్‌ల మాదిరిగానే, గూర్ఖా సైనికులు పోరాట యోధులుగానే కాదు, వీర విధేయులుగా పేరొందారు. గూర్ఖా యుద్ధంగా పేరొందిన (ఆంగ్లో-నేపాలీ యుద్ధం)లో గూర్ఖా సైనికుల పాటవాన్ని స్వయంగా చూసిన నాటి బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ అధికారి సర్ డేవిడ్ ఓచ్‌టెర్లానీ గూర్ఖాలతో ప్రత్యేకంగా ఒక పదాతిదళాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు 1815 ఏప్రిల్ 24న ‘గూర్ఖా రెజిమెంట్’ ఫస్ట్ బెటాలియన్ ఏర్పాటైంది. అప్పటి వరకు ఈస్టిండియా కంపెనీ సహా బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో విడివిడిగా గూర్ఖాలు చేరి పనిచేశారు.
గూర్ఖా రెజిమెంట్ ఏర్పాటయ్యాక, ఇంకా పెద్ద సంఖ్యలో నియామకాలు జరిగాయి. అనేక యుద్ధాల్లో బ్రిటీష్ ఇండియన్ ఆర్మీకి విజయాలు అందించడంలో ఈ రెజిమెంట్ కీలక పాత్ర పోషించింది. 1857 నాటి సైనిక తిరుగుబాటును అణచివేయడంలోనూ గూర్ఖా రెజిమెంట్ ముఖ్య భూమిక పోషించడంతో బ్రిటీష్ పాలకులు గూర్ఖా సైనికుల నియామకాన్ని మరింత పెంచారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యేనాటికి బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో 10 గూర్ఖా రెజిమెంట్లు ఏర్పాటయ్యాయి. ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ తరఫున కామన్‌వెల్త్ దేశాల కోసం చేసిన యుద్ధాల్లో గూర్ఖా రెజిమెంట్ పశ్చిమా మాంటే క్యాసినో (ఇటలీ) నుంచి తూర్పున రంగూన్ (బర్మా) వరకు నేక యుద్ధాల్లో పాల్గొంది.
భారతసైన్యంలో భాగమై…
1947లో భారత ఉపఖండానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత బ్రిటన్, భారత్, నేపాల్ దేశాల మధ్య ఒక త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఆ ప్రకారం మొత్తం 10 గూర్ఖా రెజిమెంట్లలో 6 రెజిమెంట్లను భారత సైన్యంలో భాగం చేశారు. ఈ 6 రెజిమెంట్లకు అదనంగా భారత ప్రభుత్వం గూర్ఖాల కోసం 7వ రెజిమెంట్‌ను ఆ తర్వాతి కాలంలో ఏర్పాటు చేసింది. స్వతంత్ర భారతదేశం చేసిన అనేక యుద్ధాల్లో ఈ గూర్ఖా సైనికులు విరోచితంగా పోరాడి విజయాలు అందించారు. 2020 నాటికి ఈ 7 రెజిమెంట్లలో కలిపి మొత్తం 39 బెటాలియన్లు ఉన్నాయి. వీటిలో సుమారు 32,000 మంది గూర్ఖాలు ఉన్నారు. ఈ గూర్ఖాల్లో నేపాల్ జాతీయులైన గూర్ఖాలదే సింహభాగం.
భారత్‌తో పోల్చుకుంటే బలహీన ఆర్థిక వ్యవస్థ కల్గిన హిమాలయ దేశం నేపాల్‌కు గూర్ఖా రెజిమెంట్లు ఒక వరంగా నిలిచాయి. నేపాల్ సైన్యంలో ఇచ్చే జీతంతో పోల్చితే భారత సైన్యంలోని గూర్ఖా రెజిమెంట్లో ఇచ్చే జీతం రెండున్నర రెట్ల అధికం. జీతంతో పాటు పెన్షన్ వంటి ఆర్థిక భద్రత, ఆరోగ్య భద్రత, సామాజిక భద్రత వంటి ఇతర భారత సైనికులకు లభించే అన్ని సదుపాయాలు కూడా వారికి అందుతాయి. గూర్ఖా రెజిమెంట్లో పనిచేసిన నేపాలీలు రిటైరైన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లకుండా భారత్‌లోనే ఉండాలనుకుంటే ఉండొచ్చు. ఆ వెసులుబాటును కూడా భారత ప్రభుత్వం కల్పించింది.
2024 ఏప్రిల్ నాటికి భారత ప్రభుత్వం నుంచి పెన్షన్ అందుకుంటున్న నేపాలీ గూర్ఖాల సంఖ్య 1,22,000 మంది. వీరందరి కుటుంబాలకు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతున్నాయి. ఇలా ఆ దేశంలో గణనీయమైన సంఖ్యలో ప్రజానీకం భారత సైన్యంలో గూర్ఖా రెజిమెంట్ ద్వారా లబ్ది పొందుతోంది. నేపాల్ గడించే ఆదాయంలో గూర్ఖా సైనికుల ద్వారా వచ్చే ఆదాయం ఆ దేశ జీడీపీలో గణనీయమైన వాటా కలిగి ఉంది. ఇంకా చెప్పాలంటే నేపాల్ రక్షణ శాఖ బడ్జెట్ కంటే ఆ దేశంలోని గూర్ఖా సైనికులు భారత్ నుంచి పొందే వేతనాలు, పెన్షన్ల సొమ్మే ఎక్కువ. భారత్-నేపాల్ సత్సంబంధాలలో ఈ గూర్ఖా రెజిమెంట్ల పాత్ర వెలకట్టలేనిది.
అయితే 2020లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆర్మీ నియామకాలు నిలిచిపోగా.. ఆ తర్వాత తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకం కారణంగా గత నాలుగేళ్లలో ఇప్పటి వరకు ఒక్క గూర్ఖా నియామకం కూడా జరగలేదు. అగ్నిపథ్ కారణంగా నేపాల్ యువత గతంలో మాదిరిగా శాశ్వత ప్రాతిపదికన సైన్యంలో ఉద్యోగం పొందడం లేదు. అగ్నిపథ్ పథకం బ్రిటన్-భారత్-నేపాల్ దేశాల మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందానికి విరుద్ధమని ఆ దేశం చెబుతోంది.
శత్రువుకు ఆయుధంగా మారే ప్రమాదం!
విరోచిత పోరాటపటిమ కల్గిన గూర్ఖాల నియామకం నిలిచిపోతే దాని పర్యవసానాలు భారత్‌కు ఆందోళన కల్గించేలా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2021 నుంచి సుమారు 14,000 మంది గూర్ఖా సైనికుల రిటైర్మెంట్లు జరిగాయి. కొత్తగా నియామకాలు లేకపోవడంతో నేపాల్ యువత ఉపాధి ఆ మేరకు దెబ్బతిన్నది. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే.. పదేళ్లలో గూర్ఖాలే లేని గూర్ఖా రెజిమెంట్లు మిగులుతాయి. ఇది నేపాల్‌కు ఏమాత్రం మింగుడుపడడం లేదు. 2020లో నేపాల్ ఓ సవరించిన మ్యాప్ విడుదల చేస్తూ.. అందులో భారత భూభాగాన్ని తమ భూభాగంగా చూపింది. అంతటితో ఊరుకోకుండా, ఆ కొత్త మ్యాప్‌తో రూ. 100 కరెన్సీ నోట్లను కూడా ముద్రిస్తామని ప్రకటించింది. మరోవైపు నేపాల్‌కు ఆయాచిత సాయం అందిస్తూ చైనా తమ చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
నేపాల్ దేశంలో వ్యూహాత్మక, ఆర్థిక పాదముద్రలను విస్తరించిన భారతదేశం.. సత్సంబంధాలను కొనసాగించకపోతే.. భారత్‌కు ముప్పుగా మారిన చైనా నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)లో నేపాలీ గూర్ఖాలను చేర్చుకునే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో రష్యా తరఫున సుమారు 15,000 మంది నేపాలీ యువత పాల్గొన్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నేపాల్‌ను మచ్చిక చేసుకునే క్రమంలో చైనా ఆ దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఇంధన రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. నేపాల్‌తో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు కూడా చేస్తోంది. ఈ చర్యలు భారత ప్రయోజనాలకు ఆందోళన కల్గించేవే.
నైబర్‌హుడ్ ఫస్ట్ విధానం
భారతదేశం “నైబర్‌హుడ్ ఫస్ట్” (పొరుగువారే ముందు) అనే విదేశాంగ విధానాన్ని అవలంబిస్తోంది. ఈ క్రమంలో భారత్‌కు శత్రు దేశాలుగా ఉన్న పాకిస్తాన్, చైనా మినహా మిగతా అన్ని పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉంది. అయితే భారత్ పొరుగు దేశాల్లో అటు చైనా, ఇటు అమెరికా కుంపట్లు రాజేస్తూ అస్థిరపరుస్తూ వస్తున్నాయి. మాల్దీవులు, శ్రీలంక, తాజాగా బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాల వెనుక ఎవరున్నారో ప్రపంచానికి తెలుసు. అయినా సరే.. భారత్ తన పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ సహాయసహకారాలు అందజేస్తోంది. నేపాల్‌తో గూర్ఖా రెజిమెంట్ నియామకాల విషయంలో నెలకొన్న వివాదాన్ని కూడా భారత్ అన్ని కోణాల్లో విశ్లేషిస్తోంది. ప్రస్తుతం ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్ భారత పర్యటనలో ఉన్నారు. ఆయనకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ ‘జనరల్’ హోదా ఇచ్చారు. భారత ఆర్మీ చీఫ్‌కు నేపాల్‌లో, నేపాల్ ఆర్మీ చీఫ్‌కు భారత్‌లో ‘గౌరవ జనరల్’ హోదా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. నేపాల్ ఆర్మీ చీఫ్ భారత పర్యటనలో ఈ అంశాలన్నింటికీ ఒక పరిష్కారం లభిస్తుందని రెండు దేశాలు ఆశాభావంతో ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..