అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరం కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. కాల్పుల ఘటనలో గాయపడ్డ ఇద్దరిలో హనుమంతు అనే వ్యక్తి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందగా.. రమణ అనే వ్యక్తి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. పాత సామాన్ల వ్యాపారులపై తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
తెల్లవారుజామున వ్యాపారానికి వెళ్తుంటే సడెన్‌గా ఏదో జరిగిందన్నారు బాధితుడు రమణ. బుల్లెట్ వచ్చి తగిలినట్లు అనిపించిందని, తీవ్ర గాయాలతో ఇంటికి పరుగులు తీశామని చెప్పారు. ఆ తర్వాత.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఇక.. తమకు ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేవన్నారు బాధితుడు రమణ
మరోవైపు.. మాధవరం ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్రగాయాలతో ఇంటికి వచ్చిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఇప్పటికే ఒకరు చనిపోగా, మరొకరికి ఏం జరుగుతుందోనని భయంగా ఉందన్నారు బాధిత కుటుంబ సభ్యులు. ఈఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితులు నివాసం ఉండే ప్రాంతంలోని పలువురిని విచారించారు. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..